హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ రాకపోకలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా చేరుకునేందుకు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సిద్ధమైంది.
తాజాగా.. హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది. నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్‌చెరు, ఎల్‌బీనగర్ – హయత్ నగర్ మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలని నిర్ణయిచింది. ఈ మేరకు శనివారం (అక్టోబర్ 26) సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. జీవో 317కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏను విడుదల చేయాలని కేబినెట్ తీర్మానించింది. జీవో 46కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్‌లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు చేసింది. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు చేయాలని నిర్ణయించింది. మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.