ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (అక్టోబర్ 27న) ప్రసారమైన మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్‌లో.. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కల్పించటమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ నరేంద్ర మోదీ పలు విలువైన విషయాలను పంచుకున్నారు. ప్రజల్లో ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ చేసిన ప్రయత్నంపై స్పందించిన సజ్జనార్.. ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సజ్జనార్ సుదీర్ఘ ట్వీట్ కూడా చేశారు. ఈ పోస్టుకు ప్రధాని మన్ కీ బాత్ వీడియోను కూడా సజ్జనార్ జతపర్చారు.
"నేటి మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. నకిలీ పోలీస్‌తో ఒక వ్యక్తి మాట్లాడిన వీడియోను ఆయన పంచుకున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నాడో ప్రస్తావించారు.
కర్ణాటక విజయపూర్ చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తి.. నకిలీ పోలీస్‌తో చేస్తోన్న సంభాషణను నా ఎక్స్ ఖాతాలో సెప్టెంబర్ 19న మొదటగా నేను పోస్ట్ చేశాను. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో భాగంగా చేసిన ఆ ట్వీట్‌ను ఆధారంగా తీసుకుని సందీప్ పాటిల్‌ను గుర్తించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సంతోష్ పాటిల్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.
ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే.. మోసగాళ్లు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే 1930కి డయల్ చేయండి. సురక్షితమైన డిజిటల్ భారత దేశాన్ని రూపొందించేందుకు కలిసి రండి." అంటూ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే.. డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలకు భయపెడుతూ అందినకాడికి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ "మన్ కీ బాత్"లో ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ ద్వారా కానీ... వీడియో కాల్ ద్వారా కానీ విచారణ చేపట్టదని సూచించారు. ఈ విషయాన్ని గమనించి.. పోలీసులు, ఏజెన్సీల పేరుతో వస్తున్న సైబర్ నేరగాళ్ల కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.