హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని.. సదర్ సమ్మేళనాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని తెలిపారు.
యాదవులు రాకీయంగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యాదవులకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణుడు ఆరోజు పాండవుల పక్షాన నిలబడి ధర్మాన్ని నిలబెట్టారని.. ఆయనను నమ్ముకునే యాదవులు సైతం ధర్మం వైపు నిలబడుతారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ధర్మం వైపు నిలబడ్డ ఎవరూ అన్యాయానికి గురికారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. అవకాశం వచ్చిన ప్రతిసారి యాదవులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. అనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించి ఉంటే.. ఈరోజు మంచి మంత్రి అయ్యేవారని గుర్తు చేశారు. ఆయనను గెలిపించకపోయినప్పటికీ.. యాదవుల ప్రాధాన్యత ఉండాలని ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు పంపించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
మరోవైపు.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. మూసీ ప్రాంతాన్ని పునరుద్ధరణ చేసి.. అక్కడ అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీలో నరకాన్ని అనుభవిస్తున్న ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపుతామన్నారు. అక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవులు పశుగ్రాసాన్ని పెంచుకుని.. పశుసంపదను అభివృద్ధి చేసేవారన సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు హెరిటేజ్, విజయ డైరీలాంటి సంస్థలు వచ్చాయి కానీ.. ఆనాడు పాల దందా అంటే యాదవులదేనని గుర్తు చేశారు. ఏ సందర్భమొచ్చినా.. ఏ అవకాశం వచ్చినా.. యాదవులంతా ఏకమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నగరం అభివృద్ధి చేసేందుకు యాదవులు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.