ఇదే మానుకోట 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న కొత్త నియంతకు బుద్ధిచెప్పేందుకు సిద్ధమైందని తెలిపారు. గిరిజన, దళిత, పేద రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.లగచర్లలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ ముఖ్యమంత్రి మీద తిరగబడ్డారని కేటీఆర్ తెలిపారు. వారి భూములను తీసుకుంటామని చెబుతే మా ఆడబిడ్డలు 9 నెలల పాటు ధర్నా చేసి నిరసన తెలిపారని అన్నారు. 9 నెలలుగా సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఈ ముఖ్యమంత్రికి సమయం లేదని విమర్శించారు. కానీ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా 28 సార్లు ఢిల్లీకి పోయిండు.. కనీసం 28 పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు. మొన్న అధికారులు పోతే ప్రజలు నిరసన తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పోయి ఉంటే ఉరికించి, ఉరికించి కొట్టేవారని అన్నారు. ఎందుకంటే ఢిల్లీలో రైతులు ఏడాది పాటు ఆందోళన చేసి మోదీ లాంటి వ్యక్తినే నల్ల చట్టాల నుంచి వెనక్కి తగ్గేలా చేశారని గుర్తుచేశారు. రైతుల పవర్ అంటే ఆ విధంగా ఉంటుందని.. అలాంటి పవర్ ఉన్న రైతులతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని మండిపడ్డారు.
ఫార్మా విలేజ్ ఎవరి కోసమని కేటీఆర్ ప్రశ్నించారు. తన అల్లుడి కోసం రేవంత్ రెడ్డి పేదవాళ్ల భూములను గుంజుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి తన సొంత అల్లుడు, అదానీ, అన్నగాడు, తమ్ముని కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం పని చేయడం లేదని విమర్శించారు. మరో 10 రోజులైతే రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది అవుతుందని గుర్తుచేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చారా? ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడున్న డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.