విత్తన ఉత్పత్తిలో జగిత్యాల జిల్లా దేశానికే ఆదర్శం కావాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. జగిత్యాల మండలం లక్ష్మీపురంలో రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న విత్తన శుద్ధి కర్మాగారం, విత్తన గిడ్డంగి నిర్మాణ పనులకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ఎంపీ కవిత శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వార లక్ష్మీపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
టిఆర్ఎస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ కవిత మాట్లాడారు. లక్ష్మీపురం రైతులు మొత్తం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విషయంలో అందరి ముందున్నారని ఎంపీ కవిత ప్రశంసించారు. మే నెల నుంచి ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున రైతులకు ప్రభుత్వం పెట్టుబడిగా ఇవ్వబోతోందని చెప్పారు. దీని కోసం 12 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు. లక్ష్మీపురం విత్తన శుద్ధి కర్మాగారం నిర్మాణం పూర్తయితే రైతులకు విత్తనాలు ఇచ్చి మళ్లీ రైతుల నుంచి మార్కెట్ ధర కన్నా 20 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తారన్నారు. అలాగే సోయా లాంటి పప్పుధాన్యాలకు కూడా మంచి ధర లభిస్తుందన్నారు. లక్ష్మీపూర్ బ్రాండ్ పేరిట రైతులే బియ్యాన్ని అమ్ముతుండటం సంతోషకరమన్నారు.
లక్ష్మీపురం గ్రామానికి 200 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించుకుంటామని ఎంపీ కవిత తెలిపారు. త్వరలోనే 250కిపైగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. నాలుగేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపురం గ్రామం అభివృద్ధికి రూ.17 కోట్లు ఖర్చు చేశారని కవిత గుర్తుచేశారు. 868 మందికి పెన్షన్లు ఇస్తున్నారని, మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లా నీళ్ళిచ్చేందుకు రూ. 90.82 కోట్లు మంజూరు చేశారని, మిషన్ కాకతీయలో భాగంగా గ్రామంలోని నాలుగు చెరువులలో మూడేళ్ళుగా 90.70 లక్షల విలువైన పనులు జరిగాయని వివరించారు. అలాగే గ్రామంలోని 464 మంది రైతులకు రూ.2 కోట్లకు పైగా రుణమాఫీ జరిగిందని కవిత తెలిపారు. గొల్లకుర్మలకు 50.70 లక్షలు వెచ్చించి గొర్రెలను పంపిణీ చేశారని చెప్పారు.
లక్ష్మీపురం గ్రామంపై ఎంపీ కవిత వరాల జల్లు కురిపించారు. ముస్లింల కోరిక మేరకు మసీదు నిర్మాణానికి రూ. 12 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా కోల్డ్ స్టోరేజీ నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మహిళా భవనం నిర్మాణానికి ఇదివరకే ఇచ్చిన మూడు లక్షలకు తోడుగా మరో ఐదు లక్షలు మంజూరు చేశారు. కల్యాణలక్ష్మి పథకం కింద 17 మంది యువతుల పెళ్లిళ్లకు రూ. 12.76 లక్షలు ప్రభుత్వం అందించిందని చెప్పారు. గ్రామంలోని సుభాష్ నగర్ రాజీవ్ నగర్ రైతు సొసైటీలకు 5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రజక సంఘం భవనానికి 2 లక్షలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల భవన సముదాయం నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపి కవిత ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్, జగిత్యాల నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, జగిత్యాల ఎంపిపి మానస, జడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి, సర్పంచ్ పన్నాల సరిత తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa