హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రి సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన టీబీ రోగి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో చనిపోయాడు. దీనిపై అతని కుటుంబీకులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వార్డు బాయ్స్ ఇద్దరు రూ.150లంచం అడిగారని, ఇవ్వకపోవటంతో ఆక్సిజన్ పెట్టకుండా రోగి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బందితోపాటు ఇద్దరు వార్డు బాయ్స్‌పై ఆదివారం రాత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన ఆయన సంబంధిత ఇద్దరు వార్డుబాయ్‌లను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత మిగతా వారిపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు.