ముంబై: రిలయన్స్ జియో మరో ఎత్తుగడ వేసింది. గూగుల్ తో కలిసి వినియోగదారుడికి అనువైన ధరల్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లను రెడీ చేస్తోంది. గూగుల్‌తో కలసి ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సరసమైన ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫోన్ ప్రత్యేకంగా రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అందుబాటు ధరలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాదే మార్కెట్‌లోని రానుందట. ఇప్పటికే 100 మిలియన్‌కు పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న జియోతో జతకలసి తమ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంను మరింత విస్తరించాలని గూగుల్ కూడా యోచిస్తోందట.అందుకనే ఈ రెండు దిగ్గజ కంపెనీలు కలసి అందుబాటు ధరలో ఒక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే రిలయన్స్ జియో స్మార్ట్‌టీవీ సర్వీసుల కోసం కూడా గూగుల్ ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తుందట. ఈ స్మార్ట్‌టీవీలు కూడా ఈ ఏడాది చివరలో మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. ఈ ఏడాది తరువాత వీటిని విడుదల చేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్టును మరోసారి, మరో రూపంలో మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో గూగుల్, జియో బిజీగా ఉన్నాయి. రిలయన్స్ జియోకు గూగుల్ బ్రాండింగ్ బాగా కలిసొస్తుందని, వీరు రూపొందించే చవక 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడుపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో ఇప్పటికే ‘లైఫ్’ పేరిట స్మార్ట్‌ఫోన్లు విక్రయిస్తోంది. అయితే వీటికి ఆశించిన రీతిలో ఆరణ లభించలేదు. గూగుల్ భాగస్వామ్యంతో తయారుచేస్తున్న ఫోన్‌తోనైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కొల్లగొట్టాలని జియో యోచిస్తోంది.