హైదరాబాద్: అభివృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దేశంలో ఆదాయం పెరుగుదలలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రమని సీఎం అన్నారు. ప్రగతి భవన్‌లో బీసీలతో ఏర్పాటు చేసిన జనహిత కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కంటే 21శాతం ఆదాయం పెరుగుదల తెలంగాణలో ఉందన్నారు. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బడ్జెట్ ఎక్కువన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతీ కులం, ప్రతీ మనిషీ చిరునవ్వుతో జీవించాలని సీఎం ఆకాంక్షించారు. గొర్రెలను, చేపలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదగాలన్నారు. యాదవులకి 88లక్షల గొర్రెలు ఇస్తున్నమని సీఎం తెలిపారు. రెండేళ్లలో తెలంగాణలో 4 కోట్ల గొర్రెలుంటాయని సీఎం వెల్లడించారు. సంపద సృష్టించే శక్తి యాదవులకు, ముదిరాజ్‌లకు ఉందని, చేనేత అభివృద్ధికి రూ.1200 కోట్లు కేటాయించామన్నారు.