మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. మూడు, నాలుగు నెలల్లోనే ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి గ్రామం, ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామాలలో రూ. 58 కోట్ల ఖర్చుతో చేపడుతున్న మిషన్ భగీరథ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఇంటింటికి గోదావరి, కృష్ణా జలాలు అందించడమే లక్ష్యంగా గ్రామాల్లో అంతర్గత పైపు లైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్ ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మిషన్ భగీరథ నీళ్లు మొట్టమొదటగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు అందనున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఏ ఇంటి ఆడబిడ్డ కూడా బిందెతో బయట నీళ్ళకు వెళ్లకూడదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యం అని తెలిపారు.ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.