-ఆర్కేనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి?
-కోడిపుంజు గుర్తు కోసం దీప పట్టు
-అది అమ్మ సెంటిమెంట్ అట! తొలగిన ఉత్కంఠ
-జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ నుంచి పోటీకి దిగనున్న దినకరన్
చెనై్న : జయ మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ ప్రధానికి లేఖ రాసి సంచలనం సృష్టించిన నటి గౌతమి రాజకీయాల్లోకి రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జయ మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానానికి వచ్చే నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా గురువారం (16) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బుధవారం తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని డీఎంకే నేత స్టాలిన్ చెప్పగా అన్నా డీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్, పన్నీర్ వర్గం నుంచి మధుసూదనన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక జయ మేనకోడలు దీప స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. పోటీ చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్ ఊగిసలాడుతోంది. మరో వైపు జయ మృతిపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు న్యాయ విచారణకు ఆదేశించాలని గౌతమి డిమాండ్ చేశారు. అంతే కాదు. ఈ విషయంలో పలు మార్లు విమర్శలు గుప్పించిన ఆమె ప్రధానిని సైతం నేరుగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ఉప ఎన్నికలో బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కమలనాథులు ఆమె పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో సాధించిన విజయం ప్రభావం తమిళనాడుపైనా పడుతుందని, దాంతో పాటు సినీ గ్లామర్ కూడా కొంత మేరకు పని చేస్తుందనే ఉద్దేశంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు గౌతమి అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా లేదు.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న జయ మేనకోడలు దీప తనకు కోడిపుంజు గుర్తును కేటాయించాలని ఈసీని అభ్యర్థించనున్నారు. ఒకవేళ అది కాకుంటే చేప, త్రాసు, శ్రామికుల చేయి గుర్తులలో ఏదో ఒకదాని కోసం పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 12న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోడిపుంజు గుర్తు కోసం దీప గట్టి పట్టుదలతో ఉన్నారు. అన్నా డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణానంతరం పార్టీలో చీలిక ఏర్పడింది. దీంతో అప్పుడు జయ వర్గానికి ఈసీ కోడిపుంజు గుర్తును కేటాయించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఆ గుర్తును దక్కించుకునేందుకు దీప ప్రయత్నిస్తున్నట్టు `దీప పేరవై' పార్టీ నేతలు పేర్కొన్నారు. మరో వైపు అన్నా డీఎంకే రెండుగా చీలిపోవడంతో ఆ పార్టీ రెండాకుల గుర్తును ఈసీ ఎవరికి కేటాయిస్తుందోనని అటు శశికళ వర్గం, ఇటు పన్నీర్ వర్గం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాయి.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ఆమె మేనకోడలు దీప పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ నియోజకవర్గంలో అన్నా డీఎంకే నుంచి ఎవరు నిలబడతారన్న ఉత్కంఠ బుధవారంతో తొలగిపోయింది. తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును ఆ పార్టీ ప్రకటించింది. శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్‌ను ఎన్నికల పోటీకి దింపుతున్నట్లు పేర్కొంది. దినకరన్ ఇటీవలే అన్నా డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే నెల 12న ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa