ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరిత్ర నగరంపై పట్టు పెంచుకునేందుకు పార్టీల పాట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 01:03 AM

  -నగరంపై పట్టు కొనసాగించేందుకు టిఆర్‌ఎస్‌ ప్రయత్నాలు
  -హన్మకొండలో వినయ్‌, వరంగల్‌లో కొండా దంపతుల హవా
  -మేయర్‌ నరేందర్‌, కుడా యాదవరెడ్డిలను పట్టించుకోని అధికారులు
  -అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవాలని స్కెచ్‌లు గీస్తున్న కాంగ్రెస్‌
  -క్యాడర్‌ను పెంచుకునే పనిలో భారతీయ జనతా పార్టీ
  -ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల నిర్ణయం
  -తెలుగుదేశం పార్టీని పట్టించుకోని ముఖ్య నాయకులు


మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ తన బలం పెంచుకునేందుకు రక రకాల ఎత్తులు వేస్తుంది. అందులో బాగంగా వరంగల్‌ నగరాన్ని ప్రయోగ శాలగా ఎంచుకుంది. రాష్ట్రంలోనే రెండవ పెద్ద నగరంగా ఓరుగల్లుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్‌ పలుమార్లు ప్రకటించారు. ఈ రోజు నర్సన్నపేట, ఎరవ్రల్లి గ్రామాలలో డబుల్‌ బెడ్‌రూంలు పూర్తయి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. కానీ అంతకంటే ముందే వరంగల్‌ నగరంలో వీటిని పూర్తి చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం నగర పర్యటనకు అకస్మాత్తుగా వచ్చిన ముఖ్యమంత్రి శివారు ప్రాంతాలలోని మురికి వాడలను సందర్శించారు. దాదాపు ఏడు కాలనీల రూపు రేఖలు మార్చాలని ప్రయత్నించారు. ఆయా కాలనీలలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. కానీ వామపక్ష పార్టీలు ఆ ప్రక్రియను అడ్డుకోవడంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ఏడు కాలనీలకు బదులు మూడు కాలనీలకు కుదించారు. స్వయంగా జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంబించేందుకు సంకల్పించారు. అయినప్పటికి అనేక అవాంతరాలు ఎదురు కావడంతో పూర్తి కాలేదు. నగర శివార్లను కలుపుకుని ఔటర్‌రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఖాజీపేట ఫై్ల ఓవర్‌ బ్రిడ్జీ కి సమాంతరంగా మరో బ్రిడ్జీని నిర్మించేందుకు అంచనాలు పూర్తి చేశారు. ఇలా అభివృద్దిని పరుగులు పెట్టించ… డం ద్వారా నగరంలో పాగా వేయాలని అధికార పార్టీ స్కెచ్‌లు గీస్తుంది. గ్రేటర్‌ వరంగల్‌ను ఆనుకుని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్ని కూడ టిఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్నాయి. నగర పరిదిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోను వరంగల్‌ పశ్చిమకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, తూర్పు నియోజకవర్గానికి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరు కూడ మాస్‌ లీడర్లుగా ప్రజలలో గుర్తింపు ఉన్న వారు కావడం విశేషం. ఇద్దరు నేతలకు టిఆర్‌ ఎస్‌ పార్టీ ముఖ్యనేతలతో సత్సంబందాలు ఉన్నాయి. ఆ పలుకుబడితో నిధులను తీసుకురావడంలో పోటీపడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టిఆర్‌ఎస్‌కు తిరుగు లేకుండా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 


వరంగల్‌లో పాగా వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్‌


ఓరుగల్లు నగరంలో ఎలాగైనా పాగా వేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కలలు కంటుంది. హస్తం పార్టీ అధికారంలో ఉన్నపుడు నగరంలో ఆ పార్టీకి తిరుగు లేకుండా ఉండేది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మాజీ మంత్రి బసవరాజ్‌ సారయ్య ఎదురు లేకుండా నాలుగు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాదించారు. తెలంగాణ కాంగ్రెస్‌పార్టీ ప్రజా ప్రతినిధుల ఫోరం ఛైర్మన్‌ గా వ్యవహరించిన ఆయన ఇటీవల టిఆర్‌ఎస్‌లో చేరారు. మరో ముఖ్య నేత బండా ప్రకాశ్‌ కూడ పార్టీ వీడారు. 


     దీంతో వరంగల్‌ నగర కాంగ్రెస్‌ బాధ్యతలను రాజనాల శ్రీహరి చూసుకుంటున్నారు. కొండా దంపతులను ఎదుర్కొని పార్టీని నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ముస్లిం మైనారిటీ వర్గాలను కలుపుకుంటు ముందుకు సాగిపోతున్నారు. హన్మకొండ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీకి ఎమ్మెల్యే లేకుండా దాదాపు ముప్పయి సంవత్సరాలు అవుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న నాయిని రాజేందర్‌రెడ్డి ఈ నియోజకవర్గంలో పట్టు పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్ఠానం ఆయనను కాదని ఎరబ్రెల్లి స్వర్ణకు అవకాశాలు ఇస్తుండడంతో వెనక్కి తగ్గారు. ఇటీవల జరిగిన కార్పోరేషన్‌ ఎన్నికలలో పార్టీ నగరాధ్యక్షులుగా ఉన్న తాడిశెట్టి విద్యాసాగర్‌ కాంగ్రెస్‌ను వదిలి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన కార్పోరేటర్‌గా ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ కేవలం ఒకే ఒక్క డివిజన్‌లో గెలుపొందింది. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల మద్య కాంగ్రెస్‌ పార్టీ నగరంలో పట్టు పెంచుకునే వ్యూహలకు పదునుపెట్టింది. పొన్నాల రంగంలోకి దిగారు. స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్న వినయ్‌భాస్కర్‌, కొండా సురేఖలపై ఉన్న వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన ప్రణాళికలు రచిస్తునారు. 


ప్రజా ఉద్యమాలను నిర్వహించేందుకు వామపక్షాల ప్రయత్నాలు


గతంలో వరంగల్‌ నగరంలో వామపక్ష పార్టీలకు మంచి ఓటు బ్యాంకు ఉండేది. ఇళ్ల స్థలాలు, నగరంలో మౌళిక సదుపాయాల కల్పనకు ఆ పార్టీలు పోరాటాలు నిర్వహించాయి. కానీ టిఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పడిన నాటి నుండి ఉద్యమాలకు దూరంగా ఉంటుండడంతో కాస్తా ఇబ్బందులు ఏర్పాడ్డాయి. అయినప్పటికి నగర శివారు ప్రాంతాలలో ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఆయా పార్టీ అధ్వర్యాన ఏర్పాటు చేసిన కాలనీలలలో ఇంకా  కమ్యూనిస్టుల హవానే కొనసాగుతుండగా భారతీయ జనతా పార్టీ మేదావి వర్గంలో పట్టు పెంచుకనే వ్యూహంతో ముందుకు సాగుతుంది. తనకున్న ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలను దీటుగా ఎదుర్కోవాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. టిడిపి చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుండగా ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వరంగల్‌ అర్బన్‌ అధ్యక్షులుగా కొనసాగుతున్న ఈగ మల్లేశం తూర్పు నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించారు.


 


    రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.పశ్చిమ నియోజకవర్గం అనాథగా మారింది. అనిశెట్టి మురళి అర్బన్‌ అధ్యక్షులుగా కొనసాగిన సమయంలో కాస్తో, కూస్తో క్యాడర్‌ ఉండేవారు. కానీ ఆయన అధికార పార్టీలోకి జంప్‌ చేయడంలో ఉన్న నలుగురు చెల్లా చెదురయ్యారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నగరంలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ పార్టీల మద్యే పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa