భ్రమించేలా బడ్జెట్‌లోని అంకెలు
1956 నుంచి 1994 వరకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ
1994 నుంచి 2000 వరకు ఆస్తుల కంటే అప్పులు రెండింతలు
అప్పులు ఎక్కువైతే, అభివృద్ధి కుంటుబడుతుంది
కోతలు లేని విద్యుత్ మంచిదే ప్రజలపై వాతలు పడకుంటే మంచిది
ప్రజల ఆశయాలు, విశ్వాసాన్ని నిలబెట్టేలా పాలన ఉండాలి
సభలో అర్థవంతమైన చర్చ జరగాలి
ప్రభుత్వం చెప్పిందే, ప్రతిపక్షాలు వినాలనే ధోరణి సరికాదు
ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను పరిగనలోకి తీసుకోవాలి
శాసన సభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి
హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్ చాలా గందరగోళంగా.. ప్రజలు భ్రమించేలా ఉందని, ఆశల పల్లకిలో విహరించేలా బడ్జెట్ అంకెలు ఉన్నాయని విమర్శించారు. మంత్రి ఈటెల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే సప్త సముద్రాలు దాటిందని, అభివృద్ది మాత్రం కనబడటం లేదని, అందులోని అంకెలు మాత్రం జానెడు..బెత్తెడు, బారెడు.. మూరెడుగా కనిపిస్తున్నాయంటూ సభలో జానా ఛలోక్తులు విసిరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలని.. ప్రజల ఆశయాలు, విశ్వాసాన్ని నిలబెట్టేలా పాలన ఉండాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను పాలకపక్షం పరిగణనలోకి తీసుకోవాలని.. వాటిని అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలని జానారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తన సూచనలన్నీ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిచేలా చేసేందుకేనని ఆయన స్పష్టం చేశారు. సభలో అర్థవంతమైన చర్చ జరిగేలా ప్రభుత్వం సహకరించాలని.. ప్రభుత్వం చెప్పిందే ప్రతిపక్షాలు వినాలనే ధోరణిలో సభ సాగడం సరికాదన్నారు. 1956 నుంచి 1994 వరకు అప్పులు కంటే ఆస్తులు ఎక్కువగా ఉండేవని.. 1994 నుంచి 2000 వరకు ఆస్తుల కంటే అప్పులు రెండింతలు పెరిగిపోయాయని జానారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2014 నాటికి తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎక్కువ ఉండేదని తెలిపారు. పరిశ్రమల్లో వృద్ధిరేటు పెరిగినా.. వ్యవసాయం తగ్గుతూ వస్తోందన్నారు. 2013-14లో రాష్ట్రంలో 107 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు జరిగితే... 2014-15లో 72లక్షల టన్నులు, 2015-16లో 51లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తి రుణమాఫీని అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందుకు గురయ్యారని, ఆత్మహత్యలు చేసుకున్న వారికి పరిహారం కూడా అందడం లేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. విద్యుత్ రంగంపై ముందు చూపు లేకుంటే నష్టాల బారిన పడే ప్రమాదముందని జానా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలోనే 50వేల మెగా వాట్ల మిగులు విద్యుత్ ఉందని, మన రాష్ట్రంలో కోతలు లేకుండా అందిస్తున్న విద్యుత్.... వాతలు ప్రజలపై పడకుండా చూడాలన్నారు.
గత ప్రభుత్వాల కృషి ఫలితంగానే రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులను త్వరగా నిర్మించుకోగలిగామన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa