-రంగంలోకి దిగనున్న వామ పక్షాలు
-ఇప్పటికే పవన్‌తో సై అన్న సిపిఐ అదే బాటలో సిపిఎం
-టిడిపితో పోతే ఎలా అన్న ఆలోచనలో సుత్తి, కొడవలి
-హోదా విషయంలో కేంద్ర, రాష్ట్రాలపై పవన్ ధ్వజం
-బీజేపీకి దూరమేనన్న సంకేతాలిచ్చిన పవన్
-మరి టిడిపిపై స్పష్టత ఎప్పుడు ఇస్తారు ?
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : వచ్చే ఎన్నికలలో తాను ఎక్కడినుంచి పోటీచేయనున్నది స్పష్టత ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు కూడా ఉండొచ్చన్న సంకేతాలివ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్లపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదికకు బీజం పడుతుందా అన్న చర్చ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇతర పార్టీలతో పొత్తు లుండొచ్చన్న సంకేతాలివ్వడంతో త్వరలోనే ఏపీలో కొత్త రాజకీయ సమీ కరణలు ఊపందుకొంటాయన్న చర్చ సాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదికకోసం పరితపిస్తున్న వామపక్షాలకు జనసేన పార్టీ అధినేత వైఖరి కొంత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. గత కొన్ని రోజులగా నెలకొన్న పరిణా మాల నేపథ్యంలో జనసేన పార్టీతో కలసి పనిచేసేందుకు సిపిఐ రాష్టస్రమితి కార్యదర్శి కె.నారాయణ ఇప్పటికే సై అన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా రంగంలోకి దిగితే ఆ పార్టీతో కలసి పయనించాలని సిపిఐ నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు సిపిఎం నాయకత్వం కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు జనసేన పార్టీ అధినేత వైఖరిపై పూర్థిస్థాయి స్పష్టత తోలేని సిపిఎం నాయకత్వం ఆ పార్టీతో కలసి పయనించే విషయంలో ఇంకొ ంత వేచిచూసే ధోరణీని అవలంభించాలని తొలుత యోచిస్తోంది. కానీ పవన్ కళ్యాన్ ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి పొత్తులుండొచ్చన్న సంకేతాలిచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలసివెళ్లే యోచనలో ఉన్న వామ పక్షాలకు జనసేన ఓ అవకాశ వేదికగా కనిపిస్తున్నట్లు సమాచారం. మరో వైపు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తానని ప్రకటిస్తూనే పొత్తు విషయంలో కూడా స్పష్టతను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే ఆయన ఏ పార్టీతో పొత్తు కడతారు అన్నది ఓ స్పష్టత ఇస్తే మాత్రం ఏపీలో ఏ పార్టీ ఎవరితో జతకడుతుందన్న రాజకీయ ముఖచిత్రం వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీకి ప్రత్యేక హోదా విష యంలో గర్జిస్తున్న పవన్ కళ్యాన్ మున్ముందు తన దూకుడును అదే రీతిలో కొన సాగిస్తారా లేక రూటు మార్చుతారా అన్నది ఆసక్తిగా మారింది.
జనసేనాని పాత స్నేహితులతోనేనా కొత్త బాట పడతారా
జల్లికట్టు తరహాలో ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమం చేపడదామని కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభసభ్యులు కేవీపీ రామచంద్రరావు సీఎంకు రాసిన లేఖతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారింది. ఈ వాతావరణ మార్పు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ఈ విషయాన్ని సైతం అన్ని రాజకీయ పార్టీలూ ధృవీకరిస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో చేసిన లోపాలను అధిగమించి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూగుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో దోస్తీ చేస్తే మేలన్న భావనలో ఆ పార్టీ నాయకత్వమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెండింగ్ కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్‌వస్తే మాత్రం వామపక్షాలకు స్నేహాస్తం ఇవ్వాలని యోచిస్తోంది. కానీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న వామపక్షాలు సైతం ఇతర పార్టీలతో చేసుకొన్న పొత్తుల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే వ్యూహాలను పదునుపెడుతున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక కోసం వామపక్ష పార్టీలో ఎదురుచూస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్ వైఖరిని ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు బిజెపి నేతలు, ఇటు టిడిపి నేతలు సైతం పవన్ కళ్యాణ్‌పై ఎదురుదాడిని ప్రారంభించిన విషయం కూడా విథితమే. ఈ రాజకీయ విమర్శలు పరస్పరం కొనసాగడంతో జనసేన వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతుందన్న సంకేతాలిచ్చిన పవన్ కళ్యాన్ పొత్తులు కూడా నాటి పరిస్థితులను బట్టి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్‌పై వామపక్ష పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. గతంలో పిఆర్‌పి ఏర్పాటు సమయంలోనూ ఆ పార్టీతో వామపక్షాలు పొత్తుకు యత్నించాయి. కానీ కుదరకపోవడంతో టిడిపితో జతకట్టి మహాకూటమిగా బరిలోకి దిగినా ఎన్నికల్లో మాత్రం నష్టపోయాయి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేవలం బిజెపిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరహా దూకుడు టిడిపిపై ఆ తరువాత ప్రదర్శించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో జనసేన జతకట్టే అవకాశాలులేవన్న భావన తొలుత ఏర్పడింది. కానీ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పొత్తులుంటాయని కూడా పరోక్షంగా ప్రకటించారు. దీంతో సిపిఐ రాష్టస్రమితి నాయకత్వం పవన్‌తో జతకట్టేందుకు సై అని ప్రకటించింది. కానీ సిపిఎం నాయకత్వం మాత్రం అదే బాటలో పయనించాలని ఉన్నా పవన్ వైఖరిపై కొంత అనుమానంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వ్యూహం ప్రకారం బిజెపితోపాటు టిడిపిపైనా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారా...? ఎన్నికలు సమీపించేకొద్ది కేంద్రంతో రాష్ట్రంలోని అధికార టిడిపి విభేధించి బయటకు వచ్చి జనసేనతో కలసి పయనిస్తుందా అన్న అనుమానంను సిపిఎం నాయకత్వం వ్యక్తంచేస్తోంది. హోదా విషయంలో గర్జిస్తున్న పవన్ కళ్యాన్ వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో టిడిపి దూరమైతే ఆ పార్టీతో జతకట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో స్పష్టతవస్తేనే జనసేనతో కలిసేందుకు సై అన్నాలన్న యోచనలో సిపిఎం నాయకత్వం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa