న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురు వారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. గత రెండేళ్లలో ఆయన శ్రీలంక వెళ్లడం ఇది రెండోసారి. రేపు బౌద్ధులు నిర్వహించనున్న అంతర్జాతీయ వేసక్ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు, స్కాలర్లు, వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. తన పర్యటన గురించి శ్రీలంకకు బయలుదేరే ముందు మోడీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య మైత్రీ బంధానికి తన పర్యటనే నిదర్శనమని చెప్పారు. ప్రపంచ వారసత్వ సంపద అయిన అనురాధపుర నగరాన్ని దర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానితో మోడీ చర్చలు జరపనున్నారు.