కోలకతా : ప్రస్తుతం దేశంలో ఉన్న అసహనం, విభజన రాజకీయాల మధ్య పశ్చిమ బెంగాల్ మాత్రమే పోరాడి దేశాన్ని కాపాడగలదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ వాళ్లు తనను బెదరించి, భయపెట్టి తన నోరు మూయించలేరని చెప్పారు. బీహార్, మహా రాష్ట్ర వంటివి భయపడి ఊరుకుంటా యేమో గానీ తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం ఆపేది లేదని చెప్పారు. కేవలం బెంగాల్ ఈ మత రాజకీయాలపైన, అసహనంపైన పోరాడి దేశాన్ని కాపాడుతుందని బుద్ధ పూర్ణిమ సందర్భంగా కోకతాలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. దమ్ముంటే తనను జైలులో పెట్టాలని, తాను జైలుకు వెళ్లినా సరే అక్కడి నుంచి కూడా బీజేపీపై పోరాడతాను తప్ప తుది వరకు ఆపేది లేదని స్పష్టం చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల పేరును ప్రస్తావించకుండానే ఆ ఘటనపైనా విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కదా అని ఇతరులు ఏమి తినాలో, ఏమి తినకూడదో చెప్పే హక్కు ఉండదని, అసలైన మతం ఇది కాదని ఆమె అన్నారు. మతం మనకు రాజకీయాలు చేయమని గానీ, ప్రజలను చంపమని గానీ చెప్పదని, మతం అంటే విశ్వాసం, శాంతి, ప్రేమ, సోదర భావం అని చెప్పారు. బీఫ్, గోవధ అంశాలపై రాజకీయాలు జరుగుతున్నాయని కూడా మమత విమర్శించారు. తనను కొంత మంది బీజేపీ నేతలు హిజ్రా అన్నారని, అది సిగ్గుచేటని, తాను చెడ్డమనిషిని కావచ్చు గానీ, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు తనకు ఉందని మమత చెప్పారు.