జెరూసలెం : ఆమె ఒక టీవీ యాంకర్. లైవ్‌లో వార్తలు చదువుతోంది. అంతలో ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ అందింది. తప్పనిసరి పరిస్థితుల్లో కన్నీళ్లు ఆపుకుంటూ దాన్ని చదవాల్సి వచ్చింది. ఆ రోజుతో.. ఇంకా మాట్లాడితే ఆ బులెటిన్‌తోనే ఆ టీవీ చానల్ మూతపడింది. ‘చానల్ వన్’ అనే ఆ టీవీ చానల్‌ను ఉన్నట్టుండి మూసేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు గెలా అనే ఆ యాంకర్‌కు లైవ్‌లో ఉండగా సమాచారం అందింది. ‘ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, పార్లమెంటులో ఓ ప్రకటన చేశారు. నిజానికి ఈరోజు రాత్రిదే మా చిట్టచివరి న్యూస్ బులెటిన్’ అని ఆమె ప్రేక్షకులకు చెప్పింది. గొంతు వణుకుతుండగా ‘ఇదే మా చివరి ఎడిషన్. అందువల్ల ఇక ఈ కార్యక్రమంలో వచ్చే మిగిలిన విషయాలకు అర్థం లేదు’ అని ఆమె వివరించింది. ఈ రోజుతో చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నట్లు, వాళ్లకు కొత్త ఉద్యోగాలు దొరకాలని ఆశిస్తున్నట్లు చెప్పింది. 55 సెకండ్ల నిడివి ఉన్న ఈ క్లిప్పింగ్‌ను చానల్ వన్ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసింది. దాన్ని ఇంత వరకు 3.45 లక్షల మంది చూశారు. 1950 సార్లు షేర్ అయింది. ఆ టీవీ చానల్ ఉద్యోగులకు తమ చానల్‌ను ప్రభుత్వం మూసేస్తుందన్న సమాచారం కొంత ముందు నుంచే ఉంది గానీ అప్పటికప్పుడు అంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని మాత్రం తెలియదని బీబీసీ తన కథనంలో తెలిపింది. చిట్టచివరి సారిగా జాతీయ గీతం ఆలపించి తమ చానల్ కార్యాలయాన్ని మూసేసి బయటకు వెళ్లిపోయారు. వాళ్లలో చాలా మంది ఏడుస్తూ కనిపించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ఈ న్యూస్ చానల్‌ను ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఉన్నట్లుండి మూసేశారు. మీడియాను నియంత్రించేందుకే ఆయన ఇలా చేశారని ప్రతిపక్షాల సభ్యులు, చానల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.