ముంబయి : బీబర్.. బీబర్... అంటూ ముంబయి ఉర్రూతలూగింది. జస్టిన్ బీబర్ స్వయంగా భారతదేశానికి వచ్చి కన్సర్ట్ చేస్తున్నాడంటే ఫ్యాన్స్ వెర్రెత్తిపోయారు. వేలకు వేలు డబ్బులు పోసి టిక్కెట్లు కొనుక్కుని మరీ షోకు వెళ్లారు. తీరా చూస్తే.. అక్కడ వెనకాల ఆడియో ఒకలా వస్తోంది, బీబర్ నోరు మరోలా పలుకుతోంది. ఎక్కడా లిప్ సింక్ కావడం లేదు. సాధారణంగా మన దేశంలో ఇలాంటి కన్సర్ట్‌స అంటే.. లైవ్‌లోనే పాట పాడతారు. అలాగే అనుకుని షోకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన బీబర్ షో మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అని ఇండియన్ ఆడియన్స్ తేల్చేశారు. ప్రేక్షకుల హాజరు అయితే బ్రహ్మాండంగా ఉంది. దాంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి గానీ షో విజయవంతం అయ్యే విషయంలో మాత్రం మనోళ్లు అబ్బే అంటున్నారు. వాస్తవానికి రాత్రి పూట డిమ్ లైట్లలో స్టేజి మీద పెర్ఫార్మెన్స్ కావడంతో ఎక్కువ మంది గమనించలేకపోయారు గానీ అతడంటే పడి చచ్చే అభిమానులు తమ అభిమాన స్టార్‌ను దగ్గర నుంచి చూడాలని ఎలాగో అలా ముందుకు వెళ్లారు. వారికి అసలు విషయం తెలిసిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే దానికి బీబర్ లిప్ సింక్ అయ్యేలా ప్రయత్నించి అదే పాటను పాడుతున్నట్లుగా నోరు ఆడించాడు. కానీ, ఎక్కడా లిప్ సింక్ కాకుండా అదంతా డబ్బింగ్ అని మనోళ్లకు తెలిసిపోయింది. దాంతో సోషల్ మీడియాలో అంతా ఒక్కసారిగా తిట్టిపోశారు. ఏకంగా 75 వేల రూపాయల వరకు కూడా టిక్కెట్ ధరలు ఉన్నా కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెళ్లినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని అంటున్నారు. ట్విట్టర్‌లో ఒక యూజర్ అయితే, ప్రోగ్రాం జరుగుతున్నంత సేపు బీబర్ చ్యూయింగ్ గమ్ నములుతూనే ఉండడాన్ని గమనించారు. దాంతో ఈ ప్రోగ్రాం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అని తిట్టిపోస్తున్నారు. పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్ నుంచి వెళ్లిపోయాడా?
భారత పర్యటనకు వచ్చిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ కనిపించడం లేదట. వరల్డ్ టూర్‌లో భాగంగా ముంబయికి వచ్చిన బీబర్ బుధవారం రాత్రి డీవై పటేల్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చాడు. మొత్తం మీద మూడు రోజుల పాటు భారత్‌లో ఈయన పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ, జైపూర్ నగరాల్లో పర్యటించడంతో పాటు ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను చూడడం కూడా బీబర్ ప్లాన్‌లో ఉన్నాయి. కానీ, బుధవారం రాత్రి ప్రదర్శన అయిపోగానే బీబర్ భారత్ వదిలి వెళ్లిపోయాడట. ముంబయిలో ఉన్న వేడిని బీబర్ భరించలేక పోయాడట. ఆ వేడి వల్ల పాటలను కూడా సరిగా పాడలేకపోయాడట. అభిమానులు సైతం బీబర్ ప్రదర్శన పట్ల నిరాశ చెందినట్టు సమాచారం. మరి కారణం ఏమిటో సరిగా తెలియదు కానీ, ప్రదర్శన ముగిసిన వెంటనే బీబర్ భారత్ వదిలి వెళ్లిపోయాడని సమాచారం. అయితే, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడకు వెళ్లాడనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు.