రాలెగావ్ సిద్ధి : తన వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు రావడం దుర్వార్తేనని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తెలిపారు. రాలెగావ్ సిద్ధిలో ఆయన మాట్లాడుతూ, తామిద్దరం కలిసి పోరాడిన రోజుల్లో తమ లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. దేశంలో ఏళ్లుగా పాతుకుపోయిన భ్రష్టాచార్ (అవినీతి)ని రూపుమాపడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అలాంటి ఉన్నత లక్ష్యంతోనే తాము కలసి పోరాటం చేశామని, పెద్ద ఆందోళన నిర్వహించామని ఆయన తెలిపారు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు రావడం తన వరకు బాధాకరమైన విషయమని ఆయన చెప్పారు. అయితే, దీనిపై స్పష్టమైన సమాచారం లేకుండా ఆరోపణల మీద ఆధారాపడి ఆయనను దోషిగా వ్యాఖ్యానించనని హజారే స్పష్ట ం చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమని, అవి నిరూపితం కావాలని ఆయన అన్నారు. అవినీతికి తాము వ్యతిరేకమని హజారే స్పష్టం చేశారు.
దాడి చేయించింది ఆమ్ ఆద్మీనే: కపిల్ మిశ్రా
తనపై దాడి చేయించింది ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ వద్ద పని చేస్తాడని చెప్పారు. ఆప్ నేతల విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన మిశ్రాపై బుధవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం ఉదయం మీడియాతో మిశ్రా మాట్లాడుతూ, ‘ఇదంతా ఆమ్ ఆద్మీ ప్లాన్. దాడి చేసిన వ్యక్తి సత్యేంద్ర జైన్ మొహల్లా క్లినిక్ ప్రాజెక్టులో పని చేస్తున్నాడు. అతడు పార్టీ కార్యకర్త కూడా’ అని చెప్పారు. అయితే, ఘటన జరిగిన తరువాత పోలీసుల తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు. కాగా, కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వీటిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు అప్పగించనున్నానని మిశ్రా చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కపిల్ మిశ్రా బుధవారం సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనపై బుధవారం సాయంత్రం దాడి జరిగింది. దీక్షా స్థలం వద్దకు అకస్మాత్తుగా వచ్చిన అంకిత్ భరద్వాజ్ అనే యువకుడు మిశ్రాపై దాడికి దిగాడు. కేజ్రీవాల్‌పై నువ్వు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమంటూ చేయిచేసుకోబోయాడు. దీంతో మిశ్రా మద్దతుదారులు భరద్వాజ్‌ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, భరద్వాజ్ బిజెపికి చెందిన యువ మోర్చా సభ్యుడని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దాడి బిజెపినే చేయించిందని విమర్శలు చేసింది. అయితే, ఈ విమర్శలను కపిల్ మిశ్రా వ్యతిరేకించారు. తనపై దాడి చేసింది ఆమ్ ఆద్మీనే అని చెప్పడం గమనార్హం.