వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్‌డ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జూలైలో భేటీ కానున్నారు. హాంబర్గ్‌లో జరగనున్న జి20 దేశాల సదస్సులో భాగంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చిస్తారని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. గురువారం ట్రంప్‌ను కలిసిన తరువాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రష్యా అధినేత పుతిన్‌తో ట్రంప్ తొలి భేటీ ఇదే కానుంది. సిరియాలో ఉగ్రవాదంపై రష్యాతో పాటు తమ సేనల సంయుక్త పోరుకు స్వస్తి చెబుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల రష్యా అధినేతకు ట్రంప్ కాల్ చేసి ప్రమాదకరమైన ఉత్తర కొరియా అంశంపై మాట్లాడారు. అణ్వస్త్ర పరీక్షలకు దూరంగా ఉండాలన్న అమెరికా హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయని ఉత్తర కొరియా అధినేత కిమ జోంగ్ ఉన్ తమ క్షిపణి పరీక్షలను అవసరమైతే రెట్టింపు చేస్తామని హెచ్చరించిన విషయంపై చర్చించారు. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణు పరీక్షలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టం చేసిన నేపథ్యంలో రష్యా సాయంతో ఉత్తర కొరియాను ఢీకొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ది క్రెమ్లిన్ వెబ్‌సైట్ మాత్రం పుతిన్, ట్రంప్ తమ వ్యక్తిగత పనులకే అగ్ర తాంబూలం ఇవ్వనున్నట్లు సూచించింది. మరో వైపు ట్రంప్ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కొమెను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్! చాలా పెద్ద తప్పు చేశారు: డెమొక్రాట్ చుక్ స్కూమెర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద తప్పు చేశారంటూ ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ మండిపడింది. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై పెదవి విప్పని డెమొక్రాట్లు మాత్రం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కోమియోను బర్తరఫ్ చేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ నేత చుక్ స్కూమెర్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెద్ద తప్పు చేశారని అన్నారు. రష్యా సంబంధాల విషయంలో విచారణ పూర్తయితే తన తప్పులు బయటపడతాయనే భయంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ చర్యతో రష్యాతో కలసి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అనుమానం మరింత బలపడిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అమెరికన్ అనుమానం వ్యక్తం చేసేలా తీవ్రమైన తప్పు ట్రంప్ చేశారని ఆయన చెప్పారు.
అమెరికాకు ఉత్తర కొరియా స్ట్రాంగ్ వార్నింగ్
ప్రపంచానికి పెద్దన్న వంటి అమెరికాను బెదరించాలని ప్రపంచంలోని ఏ దేశమూ ప్రయత్నించదు. ఉత్తర కొరియా మాత్రం అమెరికాకు తీవ్ర హెచ్చరికలు చేస్తోంది. ఇంతవరకు అమెరికా బెదరింపులకు సమాధానం మాత్రమే చెప్పుకొచ్చిన ఉత్తర కొరియా తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన వివరాల్లోకి వెళితే, ‘ఇటీవల మేము నిర్వహించిన డ్రిల్ యుద్ధానికి ప్రారంభం వంటిది. అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది. యుద్ధం జరిగితే కోట్ల మంది అమెరికన్లు అణు దాడిలో మరణిస్తారు. ఆ దేశ స్వరూపమే మారిపోతుంది. అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణ కొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది’ అని సూచించింది. అదే సమయంలో ఉత్తర కొరియాలోని ఒక మీడియా సంస్థ యుద్ధ వినాశనం నుంచి తప్పించుకోవాలంటే అమెరికాకు ఒకే ఒక్క దారి ఉంది. దక్షిణ కొరియా నుంచి వారి మిలిటరీని, ప్రజలను స్వదేశానికి తీసుకువెళ్లాలి అని స్పష్టంగా తెలిపింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థను ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ రకమైన హెచ్చరికలు చేయడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.
అమెరికాకు అంత సీన్ లేదు... మొదట దాడి చేసేది మేమే
ఉత్తర కొరియా రాయబారి సంచలన వ్యాఖ్యలు
తమ దేశంపై అమెరికా ముందు దాడి చేయలేదని తమకు తెలుసని, తాము మాత్రం అలా కాదని, ఏ క్షణంలో అయినా అమెరికాలోని ప్రధాన భాగాలను బూడిద చేసేస్తామని యూకేలోని ఉత్తర కొరియా రాయబారి సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో ఉత్తర కొరియాకు నెలకొన్న వివాదంపై ఆయన మాట్లాడుతూ, కొరియా జలాల్లోకి ప్రవేశించిన అమెరికా బలగాలు ఒక్క అంగుళం ముందుకు కదిలినా తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చూస్తూ ఊరుకోరని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పిన ఆయన, అమెరికా ఏమాత్రం హద్దు మీరినా ఆ దేశంలోని ప్రధాన భాగాలను తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ బూడిద కుప్పగా మారుస్తారని అన్నారు. అయితే, అందుకు తేదీ, సమయం గురించి తమకు ఎవరికీ కచ్చితంగా తెలియదని ఆయన చెప్పారు. త్వరలోనే ఆరో అణు పరీక్ష నిర్వహించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరికీ భయపడబోమని, భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంతే కాదని, అమెరికా మొదటగా దాడి చేయలేదని తమకు తెలుసునని, మొదట దాడి చేయబోయేది తమ అధ్యక్షుడేనని ఆయన ప్రకటించారు. తాజాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరిస్తానని, కిమ్‌ను త్వరలోనే కలుస్తానని ప్రకటన చేసిన అనంతరం యూకేలోని ఉత్తర కొరియా రాయబారి చేసిన వ్యాఖ్యలు ప్రమాద తీవ్రతను చాటి చెబుతున్నాయి.
ట్రంప్ తనను తొలగించడంపై స్పందించిన ఎఫ్బీఐ డైరెక్టర్
ఎఫ్బీఐ డైరెక్టర్‌గా తనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించడంపై జేమ్స్ కామీ స్పందించారు. తన సహోద్యోగులకు ఓ లేఖ రాసిన ఆయన దాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి ఎఫ్బీఐ డైరెక్టర్‌ను ఏదో ఒక కారణం చెప్పి లేదా ఏ కారణం కూడా చెప్పకుండానే అధ్యక్షుడు తొలగించవచ్చనే విషయం తనకు తెలుసని చెప్పారు. తనను తొలగించిన విషయంపై తాను ఎక్కువగా స్పందించబోనని, మీరు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని తన సహచరులకు సూచించారు. మిమ్మల్ని, ఎఫ్బీఐని ఎంతో మిస్ అవుతున్నానని ఆయన పేర్కొన్నారు. మీ అందరితో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అమెరికా ప్రజల భద్రత విషయంలో రాజీ పడకుండా పని చేయాలని సూచించారు. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్ సర్వర్ వాడకంపై విచారణను జేమ్స్ కామీ సరిగా హ్యాండిల్ చేయలేదన్న కారణంతో ఆయనను పదవి నుంచి ట్రంప్ తొలగించారు.