ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిఆర్‌ఎస్‌ సర్కార్‌లో నాటి పసుపు కండువాలదే హవా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:45 AM

-తెలంగాణ సర్కార్‌లో సత్తా చాటుతున్న నాటి టిడిపి నేతలు
-తుమ్మల తో మొదలైన వలసల ప్రస్థానం
-పవర్‌పాయింట్‌ లో కీ రోల్‌ పోషిస్తున్న నేతలు
-సిఎం కెసిఆర్‌ కనుసైగలలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలుగ్రేటర్‌ హైదరాబాద్‌ లో వారిదే కీలక పా్త్ర
- మ్మం జిల్లాలోను ప్రభావం చూపుతారని అంచనా
-తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చిన కెసిఆర్‌
-మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు 
  


 


  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్నది ఆ సామాజిక వర్గమేనని తెలంగాణ వాదులు టిఆర్‌ఎస్‌ నేతలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే  సామాజికవర్గమన్న ఆంధ్ర ప్రాంత నేతలన్నా గులాబీ నేతలకి మంట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తున్నారని వారిపై ఎడాపెడా విమర్శలు గుప్పించేవారు. ఆ సామాజికవర్గానికి చెందిన రాజకీయనాయకులు, మీడియా యజమానులు, పారిశ్రామిక వేత్తలు అడ్డుపుల్లలు వేస్తున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడేవారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వారంతా ఇపుడు టిఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. ఉద్యమ తెలంగాణలో శత్రుపక్షంగా ఉండే కమ్మలు బంగారు తెలంగాణలో మిత్రపక్షంగా మారారు.
  రెండు సంవత్సరాలు తిరిగే సరికి ఆ సామాజికవర్గమంతా గులాబీమ యమైంది. తెలంగాణలో గత సార్వత్రిక ఎన్నికలలో వివిధ పార్టీల తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలంతా ఇపుడు గులాబీ నీడలోకి వచ్చే శారు. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టుగా నిలిచిన వారంతా ఇపుడు కారు పార్టీకి అండగా నిలుస్తున్నారు. తెలంగాణలో ఒకరిద్దరు  నాయకులు మినహ మిగిలిన వారంతా కెసిఆర్‌తో చేతులు కలపడం విశేషం. రాష్ట్రంలో కమ్మలకు పెద్ద దిక్కుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో మొదలైన వలసల వ్యవహరం చివరికి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చేరికతో పరిసమాప్తం అయింది. టిడిపికి రాజీనామా చేసిన తుమ్మల టిఆర్‌ఎస్‌లో చేరడంతోనే కమ్మ సామాజికవర్గంలో కలకలం మొదలైంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత జూబ్లిహిల్‌‌స ఎమ్మెల్యే మాగంటి గోపీ నాథ్‌, శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గులాబీ కండువా కప్పు కున్నారు. రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షులుగా గాంధీ వ్యవహరిస్తుండడం విశేశం. ఆ తరువాత కొద్ది కాలానికే ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.


   తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కెసిఆర్‌కే జై కొట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుండి బిఎస్పీ తరుపున పోటీచేసి శాసనసభ్యుడిగా విజయం సాదించిన కోనేరు కోనప్ప మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మొదట్లోనే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణ లోని కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్టయింది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపి గరికపాటి మోహన్‌రావు, ఖమ్మం మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రమే టిడిపిలో మిగిలారు. 


గ్రేటర్‌ హైదరాబాద్‌లో వారిదే కీలకపాత్ర....


  జిహెచ్‌ఎంసి ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాదించింది. 99 స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. టిడిపి, బిజెపి కూటమి టిఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తుందని అందరు అంచనావేశారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టిడిపి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో తేరుకున్న టిడిపి ఎమ్మెల్యేలంతా టిఆర్‌ఎస్‌ బాటపట్టారు. ఏక కాలంలో ఐదుగురు శాసనసభ్యులు గులాబీ కండువాకప్పు కున్నారు. రాబోయే  సార్వత్రిక ఎన్నికల నాటికి గ్రేటర్‌లోని 10 అసెంబ్లీ స్థానాలలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు గెలుపోటములను తారుమారు చేస్తా యని టిఆర్‌ఎస్‌ నేతలు అంచనావేస్తున్నారు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలోను వారి ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.


   ఈ నేపథ్యంలో వారిని దగ్గరికి చేర్చుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రణాళిక రచించారు. ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలతోను ఆయన సయోద్యకే మొగ్గుచూపారు. దీంతో రెండేళ్ల కాలంలోనే పరిస్థితులన్ని టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి. ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుండి మంత్రి తుమ్మల క్యాబినేట్‌లో మంత్రిగా కీలక పాత్ర పోషిస్తుండగా పార్టీ మారిన వారిలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ పదవులు ఇచ్చేందుకు రంగం సిద్దమైందని సమాచారం. దీనికి సంబందించి సిఎం కెసిఆర్‌ కసరత్తు చేస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే రాష్ట్ర స్థాయి కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పదవుల భర్తీలో వీరికి ప్రాధాన్యత దక్కనుందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలోను పలువురు ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులను పంచేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్‌, ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌లలో వీరికి పదవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, సామాజిక వర్గాలు కూడ సమయానుకూలంగా మార్చుకుంటారని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa