-ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, విపక్షాలతో పలు దఫాలుగా చర్చలు
-గత పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు
-సబ్‌ప్లాన్‌లోని 19 అంశాలను మార్చాలన్న ప్రతిపాదన
-పలు ప్రతిపాదనలు సూచించిన కాంగ్రెస్, టీడీపీ ప్రతినిధులు
-పరిగనలోకి తీసుకుంటామన్న సర్కార్
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : అధికారంలోకివచ్చిన రెండున్నరేళ్లతర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌పై కీలకమైన ముందడుగు వేసింది. ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులు,ప్రతిపక్షపార్టీల ప్రతినిధులతో పలు సమావేశాలు, చర్చల అనంతరం చట్టంలో సవరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో మూడు రోజుల్లో సబ్‌ప్లాన్‌కు కొత్త ప్రతిపాదనలకు తుదిరూపం ఇవ్వనున్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్ ప్లాన్ చట్ట సవరణలకు కేసీఆర్ పచ్చ జెండా ఊపడంతో, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా చట్టాన్ని పకడ్బందీగా రూపొందించి, అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు అందరి అమోదయోగ్యంగా ఉండేవిధంగా చటసవరణపై కమిటీ సభ్యులు సీరియస్‌గా దృష్టిసారించారు. ఇప్పటికే సబ్‌ప్లాన్ చట్ట సవరణపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన, టూరిజంశాఖ మంత్రి చందూలాల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు అన్ని రాజకీయ పక్షాల, ప్రజాప్రతినిధుల అభిప్రా యాలు సేకరించాయి. మూడుసార్లు ప్రత్యే కంగా జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా విపక్షపార్టీల ప్రతినిధులతో, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో చర్చించారు. అయితే ఈ సమావేశాల్ని మొదట టీడీపీ, కాంగ్రెస్ బహిష్కరించాయి. తమ ప్రభుత్వ హయాం లో వచ్చిన చట్టాన్ని టీఆర్‌ఎస్ తన సొంత చట్టంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోం దని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీపీఎం మాత్రమే దారిమళ్లిన నిధులు, సబ్‌ప్లాన్ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత కావాలని డిమాండ్ చేసింది. సబ్‌ప్లాన్ చట్టంలో 19 అంశాలను మార్చాలని, సబ్‌ప్లాన్ చట్టసవరణ కమిటీ సభ్యులు తీర్మానించారు. ఇన్ని క్లాజుల్లో మార్పులకుబదులు కొత్త చట్టాన్ని తెస్తే బావుంటుందని టీఆర్‌ఎస్ నేతలు ప్రతిపాదించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంలు కూడా సబ్‌ప్లాన్ సవరణకు కొన్ని ప్రతిపాదనల్ని ప్రభుత్వం ముందుంచాయి. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులను కేటాయించాలని, ఈ నిధులను నోడల్ ఏజెన్సీలో పోగు చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. మూడేళ్లలో దారి మళ్లిన 17వేల కోట్లను వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాలని, చట్టంలోని సెక్షన్ 11 బీ, సీ, డీ క్లాజులను తొలగించాలని, పథకాల రూపకల్పనపై సంక్షేమ శాఖల నోడల్ ఏజెన్సీలకే అజమాయిషీ ఉండేలా చూడాలని సూచించాయి. నిధులు సక్ర మంగా ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకునేలా చట్టంలో సవరణ ఉండాలని ప్రతిపాదించాయి. చట్ట సవరణపై దళిత, గిరిజన సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పటు ్టపడుతున్నాయి. ప్రతిపక్షాల సూచనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిం చింది. ఇందులో పలు అంశాల అమలుకు అంగీకరించింది. పదేళ్ళ కాలపరి మితి ఎత్తి వేయడంతోపాటు, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకానికి ఓకే చెప్పింది. రిటైర్‌డ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిధులు పక్కదారి పట్టకుండా వారికే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. విపక్షాలిచ్చిన సలహాలు, సూచనల మేరకు చట్టసవరణ చేయాలని భావిస్తోన్న టీఆర్‌ఎస్ సర్కారు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను, ప్రగతి పద్దుగా పేరు మార్చాలని నిర్ణయించింది. . మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రతిపాదనలకు తుదిరూపం రానుంది. ప్రతిపక్షాలు మాత్రం చట్టం స్ఫూర్తిని దెబ్బతీస్తే సహించేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తు న్నాయి. ఏదిఏమైనా ఈ చట్టంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయపరిశీలకులంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa