-గాడిదలు, పక్షులు, కసబ్‌లు
-యూపీ ఐదో దశ ప్రచారంలో
-హీనస్థితికి నేతల నోటి మాటలు
-నేడు యూపీలో ఐదో దశ ఎన్నికలు
-రాహుల్ నియోజకవర్గంలోనూ పోలింగ్ ఏర్పాట్లు పూర్తి
లక్నో : ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైనా అధికా రంలోకి రావాలని బీజేపీ, అధికారాన్ని నిలుపుకోవాలని సమాజ్‌వాదీ, తిరిగి సత్తా చాటాలని బీఎస్పీ గట్టిపట్టుతో ఉండడంతో, త్రిముఖ పోటీ జరుగుతున్న వేళ, నేతల విమర్శల తూటాలు హద్దులు దాటి మరింత హీన స్థితికి చేరాయి. ఎన్నికల ప్రచారంలో నేతలు తమ నోటికి అడ్డూ అదుపు లేనట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఎన్ని కలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. బహరైచ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను గాడిదతో పోలుస్తూ ప్రధాని విమర్శించిన తరువాత, ప్రచారంలో విమర్శల వేడి మరింతగా పెరిగింది. అంతకు ముందు గుజరాత్ గాడిదల కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన వద్దని బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు అఖిలేష్ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాటల తూటాలు అక్కడితో ఆగలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అమిత్ షాను ముంబయి ఉగ్ర దాడుల్లో పాల్గొని ఉరి వేయబడ్డ కసబ్‌తో పోల్చారు. అమిత్ షా ఓ టెరర్రిస్టు వంటి వాడని అన్నారు. ఇక అఖిలేష్ అయితే అమిత్‌ను పావురంతో పోల్చారు. యూపీ నుంచి బీజేపీ పావురం ఎగిరిపోనుందని అన్నారు. ఇక తమ నేతలే ఈ తరహా విమర్శలకు దిగడంతో, కింది స్థాయి నేతలు ప్రత్యర్థులపై మరింతగా విరుచుకుపడుతున్నారు. కాగా, మలి దశలో గోండా, ఫజియాబాద్, బలరామ్‌పూర్, అంబేద్కర్ నగర్, బహరైచ్, శ్రావస్తి, సిద్ధార్థ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, అమేథి, సుల్తాన్‌పూర్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో (సమాజ్‌వాదీ అభ్యర్థి మరణించిన కారణంగా అలాపూర్ నియోజకవర్గం పోలింగ్ మార్చి 9కి మార్చడమైంది) సమాజ్‌వాదీ 37 సీట్లను గెలుచుకోగా, బీజేపీ, కాంగ్రెస్ చెరి 5, బీఎస్పీ మూడు సీట్లను, పీస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. ఈ దఫా ఎన్నికలు జరగనున్న పలు జిల్లాల్లో సమాజ్‌వాదీ బలంగా కనిపిస్తోంది. అత్యధికంగా 24 మంది అమేథిలో పోటీ పడుతుండగా, కపిల్‌వస్తు, ఎత్వా నియోజకవర్గాల్లో కేవలం ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు.
అమిత్ షాను టార్గెట్ చేసిన అఖిలేశ్ భార్య
లక్నో : ఉగ్రవాది కసాయి కసబ్ చనిపోయి చాలా రోజులవుతున్నా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల పుణ్యానా, నేతల దయ వల్ల మరోసారి అతడి పేరు విరివిగా వినిపిస్తోంది. జనాలకు చిరాకు వచ్చే స్థాయిలో కసబ్ పేరును తలుస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నోట వచ్చిన ఈ మాటను ఒక నేత త
రువాత మరో నేత మోస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలపై దాడి చేసేందుకు అమిత్ షా ఈ మాటను ఉపయోగించగా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా తిరిగి బీజేపీపై దాడి చేసేందుకు అదే పేరును తలుస్తూ దానికి కొత్త అర్థాన్ని, నిర్వచనాలను, విస్తృతిని కల్పిస్తున్నాయి. తాజాగా, కసబ్ అనే పేరుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కొత్త నిర్వచనం చెప్పారు. కసబ్ అనే పేరులో క అంటే హిందీలో కంప్యూటర్ అని, స అంటే స్మార్‌ట ఫోన్ అని, ఇక బీ అంటే బచ్చే (చిన్నారులు) అని ఆమె కొత్త అర్థం చెప్పారు. ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఉండలేమని, ఇక స్మార్‌టఫోన్‌తో ప్రభుత్వ విధానాలన్నీ కూడా తెలుసుకోవచ్చని, పిల్లల సంరక్షణే తమ ధ్యేయంగా ముందుకు వెళతామని వివరించారు. అమిత్ షా చెప్పినంత చెడు అర్థం తమకు వర్తించదని ఆమె ఎదురుదాడికి దిగారు. తొలుత కసబ్ అనే పేరులో క అంటే కాంగ్రెస్ అని, స అంటే సమాజ్‌వాది పార్టీ అని బీ అంటే బీ అంటే బీఎస్పీ అని, ఈ కసబ్ పీడ త్వరలోనే వదులుతుందని అంటూ అమిత్ షా విమర్శించగా ఆ సమయంలో స్పందించిన అఖిలేశ్ క అంటే పావురం అని చెప్పారు. ఇక మాయావతి అయితే, అమిత్ షా అయితే కసబ్‌ను మించినవారని, అసలు అమిత్ షా ఒక టెరర్రిస్టు అని తీవ్రంగా ఆరోపించారు. ఇలా, కసబ్ పేరుతో పెద్ద దుమారం రేపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa