ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సవాల్‌కు రేవంత్‌ రె`ఢీ'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 01:59 AM

-జేవీ ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపణకు సిద్ధం
-చర్చకు ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా వస్తా
-వ్యక్తిగత దూషణకు దిగితే నీబతుకు బయటపెడతా
-మంత్రి ఇంద్రకరణ్‌పై నిప్పులు చెరిగిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టులలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ బహిరంగ చర్చకు సిద్దమేనన్న మంత్రి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని ఎక్కడ, ఎప్పుడు చర్చకు పిలిచినా తాను సిద్దమేనని ఆయన ప్రకటించారు. తన ఆరోపణలకు బదులివ్వకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే ఇంద్రకరణ్‌ రెడ్డి బతుకేమిటో బయటపెడతానని ఆయన హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. హౌసింగ్‌ బోర్డుకు సంబంధించిన జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరిగిందని తాను నిర్ధష్టకరమైన ఆరోపణ చేస్తుంటే మంత్రి దానికి బదులివ్వకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇంద్రకరణ్‌ రెడ్డీ... నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ బతుకు బయటపెట్టాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. 1987లో టీడీపీ నిన్ను జడ్పీ చైర్మన్‌ను చేసిందని, 1991లో ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపితే అక్కడ పీవీ నర్సింహారావుకు అమ్ముడుపోయిన చరిత్ర నీది.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనైనా సరిగ్గా ఉన్నావా అంటే అదీలేదు.. వైఎస్‌ హయాంలో కోట్లాది రూపాయల కాంట్రాక్టు సంపాదించుకొని ఆ పార్టీకి కూడా పంగనామాలు పెట్టిన చరిత్ర నీదన్నారు. మళ్లీ మాయావతి వద్దకు వెళ్లి బీఎస్పీ టికెట్‌ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మాయావతిని మోసగించి టీఆర్‌ఎస్‌లో చేరావు.. నీ చరిత్ర ఎవరికి తెలియదు  అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగే బానిసగా బతుకుతున్న ఇంద్రకరణ్‌ రెడ్డి గురించి మాట్లాడుతూ తన స్థాయి తగ్గిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో జరిగే అవినీతికి ఎదురు నిలిచి పోరాడుతున్న తనపై అక్రమంగా ఎన్నో కేసులు బనాయిస్తున్నారని తాను వెళ్లిన ప్రతిచోటా తనపై కేసులను నమోదు చేస్తున్నారని రేవంత్‌ చెప్పారు. ఉడత ఊపులకు తాను భయపడేది లేదని, టీఆర్‌ఎస్‌ తనపై బనాయించే కేసులు వెంట్రుకతో సమానమని ఆయన తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు. తిట్టుకోవడమే ప్రధానమైతే టీఆర్‌ఎస్‌ నాయకులు, కేసీఆర్‌ కుటుంబీకు లందరూ ఒకవైపు ఉంటే తాను ఒక్కడినే మరోవైపు ఉండి వారికి సమాధానం చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. జేవీ పథకంలోత జరిగిన అక్రమాలలో తనకు వాటా లేకపోతే సీఎం కేసీఆర్‌ దానికి సంబంధించిన నివేదికలను బయటపెట్టాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఖరీదైన ప్రాంతాలలో పేదలకు ఎల్‌ఐజి, ఈడబ్లూ్యస్‌ ఇండ్లను నిర్మించే విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి దేవని సతీష్‌ మాదిగ, శ్యాంసుందర్‌ పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa