హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మాదక ద్రవ్యాల కేసులో విచారణ చేపడుతున్న ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ సెలవులు వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అకున్ సబర్వాల్ సెలవుపై వెళ్తున్నట్లు నిన్న వార్తలు వచ్చాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఆయన సెలవుపై వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకు ఆయన సెలవుపై వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం కేసు తీవ్రత దృష్ట్యా ఆయన సెలవులు రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.