న్యూఢిల్లీ: కొత్త పరోక్ష పన్నుల విధానం అమలులోకి వచ్చి రెండు వారాలైంది. ఈ నేపథ్యంలో చట్టం అమలవుతున్న తీరును జీఎస్టీ మండలి ఈ రోజు సమీక్షించనుంది. జీఎస్టీ అమలులోకి వచ్చాక జరుగనున్న తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కానుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏర్పాటైన జీఎస్టీ మండలికి మొత్తంగా ఇది 19వ సమీక్షా సమావేశం. గత సమావేశాల్లో కేంద్ర, రాష్ర్టాల ఆర్థిక మంత్రులతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఒక్కచోట భేటీ కావడం ద్వారా పలు అంశాలపై చర్చించేవారు. అయితే ఈసారి సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చర్చించుకోనున్నారు. గతనెల 30న సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్.. తదుపరి సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని నిర్ణయించింది. కానీ చట్టం అమలుతీరుపై దేశవ్యాప్త రిపోర్టు తెలుసుకునేందుకు ముందుగానే సమీక్ష నిర్వహించాలని ఆర్థిక శాఖ భావించింది. అందుకే ఈ రోజు ఢిల్లీ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలుతీరును సమీక్షించనున్నారు. జీఎస్టీ అమలులో క్షేత్ర స్థాయిలో పెద్దగా ఇబ్బందులేం ఎదురుకాలేదని ఈమధ్యే జైట్లీ తెలిపారు. ఈనెల 30లోగా జీఎస్టీఎన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని వ్యాపారులకు కేంద్రం సూచించింది.