హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ ఠాణా పరిధి చిలుకానగర్‌లో ఎల్కేజీ చదువుతున్న ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. తమ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ జీవనోపాధి కోసం ఇటీవలే నగరానికి వచ్చి టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య నిషామీనా, కూతురు ఆరోహి మీనాలతో కలిసి ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో నివాసముంటున్నాడు. కూతురు స్థానిక నలంద పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటివద్ద స్నేహితులతో ఆడుకుంటున్న ఆరోహి మీనా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తమ కూతురిని గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని పరారయ్యారని తల్లిదండ్రులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.