హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్దితోనూ నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులకు కేసీఆర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి, అకున్ సబర్వాల్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను అధికారులు కేసీఆర్‌కు వివరించారు. కేసును పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించి సామాజిక రుగ్మతలను సంపూర్ణంగా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డ్రగ్స్ సరఫరా, పేకాట క్లబ్బులు, గంజాయి సరఫరా, పోకిరీల ఆగడాలపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్నారు. ఇంకా చెప్పాలంటే దాని ప్రవేశమే లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుడుంబా, పేకాటలాగే డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని కేసీఆర్ వివరించారు. మరోవైపు నేటి ఉదయం నుంచి హీరో రవితేజను సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే.