గంట క్రితమే ఫెరారీ కారు కొన్నాడు. సుమారు కోటి 68 లక్షలు పెట్టి ఫెరారీ స్కుడేరియాను సొంతం చేసుకున్నాడు. ఆ కారును షోరూమ్ నుంచి బయటకు తీసిన గంటలోనే అతనికి చేదు జ్ఞాపకం మిగిలింది. ఈ సూపర్ స్పీడ్ ఫెరారీ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. ఫెరారీని అతివేగంగా నడిపిన ఆ వ్యక్తి పట్టు కోల్పోయి రోడ్డు నుంచి బయటకు వెళ్లాడు. వాతావరణం సరిగా లేని కారణంగా ఆ కారు గ్రిప్ పనిచేయలేదు. దీంతో కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో అది బూడిదైంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మంటల్ని ఆర్పేశారు. అయితే ఆ తర్వాతే తెలిసిందే అది అప్పుడే కొన్న కారు అని. షోరూమ్ నుంచి గంట క్రితమే బయటకు తీసుకువచ్చినట్లు ఆ కారు ఓనర్ చెప్పాడు. ఇంగ్లండ్‌లోని సౌత్ యార్క్‌షైర్‌లో ఈ ఘటన జరిగింది. ఫెరారీ స్కుడేరియాను మాజీ ఎఫ్‌వన్ డ్రైవర్ మైఖేల్ షూమాకర్ అనేకసార్లు టెస్ట్ డ్రైవ్ చేసినట్లు ఆ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.