హైదరాబాద్ : హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన భార్య షిపాలి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విక్రమ్‌గౌడ్ పోలీసులకు తెలియజేశారని అన్నారు. కాల్పుల ఘటనలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌గౌడ్ వాంగ్మూలం తీసుకునేందుకు ఆస్పత్రికి టాస్క్‌ఫోర్స్ డీసీసీ లింబారెడ్డి, బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు. వాంగ్మూలం తీసుకున్న అనంతరం షిపాలి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు శాఖపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. పోలీసులకు అన్ని వివరాలను విక్రమ్ గౌడ్ చెప్పారని తెలిపారు. ఘటనపై పోలీసులే అన్ని వివరాలు చెబుతారని చెప్పారు. తన భర్తపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాను కోరారు. విక్రమ్‌గౌడ్ ఇచ్చిన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలకం కానుంది. మరోవైపు కాల్పులు జరిపిన తుపాకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్‌పై కాల్పులు జరపడానికి బయటి నుంచి వేరే వ్యక్తులు వచ్చినట్లు సరైన ఆధారాలు లభ్యం కావడం లేదని పోలీసులు చెబుతున్నారు. అతనే కాల్చుకున్నాడా.. లేక ఇంట్లో ఏమైనా జరిగిందా అనే దానిపై సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. విక్రమ్‌గౌడ్ నివాసంలో శుక్రవారం కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తీవ్రగాయాలపాలై నెత్తురొడుతున్న విక్రమ్‌గౌడ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.