ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు భారీగా వరద నీరు రాబోతోంది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టు నుంచి దిగువ జలాశయాలకు నీటి పంపింగ్ కొనసాగుతుంది. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఎడమ కాల్వకు 900 క్యూసెక్కులు, కుడి కాలువకు 650 క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాల ప్రస్తుత నీటి మట్టం 5.88 టీఎంసీలు, కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలు. ఆల్మట్టి డ్యాంలో ఆదివారం సాయంత్రం వరకు 123.32 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాంలోకి ఇంకా 37,332 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. దీంతో దిగువకు 21,683 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 37.646 టీఎంసీలుకాగా ప్రస్తుతం 36.54 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం సాయంత్రం వరకు 19,278 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు నిండే దశకు చేరుకుంటుండటంతో దిగువకు 16,970 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వదులడంతో జూరాల ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం మొదలుకానుంది.