హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు ఎస్సీలు, బీసీల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ, ఎస్సీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఉద్ఘాటించారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. గత పాలకుల 60 ఏళ్ల పాలన, మా మూడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు మంత్రి. కాంగ్రెస్‌వి చిల్లర, అవకాశవాద రాజకీయాలు అని ధ్వజమెత్తారు. బీసీ నేత పీసీసీ అధ్యక్షుడు అయితే వెంటనే దించారని గుర్తు చేశారు తలసాని. వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కను పక్కకు పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజకీయాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు. కోదండరాం నిన్న గజ్వేల్‌కు వెళ్లారు.. తాము ఆపలేదని గుర్తు చేశారు మంత్రి. ఇది ప్రజాస్వామ్యం.. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నేరెళ్లలో 144 సెక్షన్ విధించారని తెలిపారు. తామేవరికీ భయపడమని మంత్రి స్పష్టం చేశారు.