న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్ అరవింద్ పనగడియా రాజీనామా చేశారు. ఈ నెల 31 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఆర్బీఐ మాజీ చైర్మన్ రఘురామ్ రాజన్‌లాగే తాను కూడా అమెరికా వెళ్లి విద్యా బోధనలో కొనసాగనున్నట్లు పనగడియా చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి తొలి వైస్ చైర్మన్ అరవింద్ పనగడియానే. ఈ పదవి చేపట్టక ముందు ఆయన యూఎస్‌లోనే విద్యాబోధనలో ఉండేవారు. ఆయన రాజీనామాకు కచ్చితమైన కారణం తెలియకపోయినా.. తిరిగి బోధన చేయాలన్న ఆసక్తితోనే ఆయన వెళ్లిపోతున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. తమ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిన మోదీనే అరవింద్ పనగడియాను ప్రత్యేకంగా పిలిచి ఈ బాధ్యతలు అప్పగించారు. ఇండియన అమెరికన్ ఎకనమిస్ట్ అయిన పనగడియా.. కొలంబియా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్. మొదటి నుంచీ నరేంద్ర మోదీ మద్దతుదారుగా ఉన్న ఆయన.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సక్సెస్‌ను చాలాసార్లు పబ్లిగ్గానే చెప్పారు. పనగడియా గతంలో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గానూ పనిచేశారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. వరల్డ్‌బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్‌లలోనూ పనిచేశారు. ఇండియా: ద ఎకనమిక్ జెయింట్‌తో పాటు మరో పది పుస్తకాలు ఆయన రాశారు.