హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.7 వేల కోట్లు చెల్లించామన్నారు. రైతులకు ఏడాదికి రూ.8 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రూ.1024 కోట్లతో ప్రతీ మండల కేంద్రంలో గోదాము ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ వేగంగా పూర్తి చేస్తున్నరని స్పష్టం చేశారు. ఈ నెల 10న ఎస్సారెస్పీ పునర్‌జీవన ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని హరీశ్‌రావు తెలిపారు. ఉదయం 11 గంటలకు పోచంపాడ్ దగ్గర శంకుస్థాపన జరిగిన అనంతరం..మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణకు ఉన్న అతిపెద్ద సాగునీటి వనరు ఎస్సారెస్పీ అని..ఎస్సారెస్పీ పునర్జీవానికి, ఆధునీకరణకు రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎస్సారెస్పీ 5 జిల్లాలకు మేలు చేసే పథకమన్నారు. గతంలో ఎస్సారెస్పీలో నీరు లేకుండా చేసిన్రని అన్నారు. సీఎం కేసీఆర్ ఒక రైతు కాబట్టే వ్యవసాయానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నరు. మిషన్ కాకతీయతో ఆయకట్టు భారీగా పెరిగిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండినా ఒక్క గింజ కూడా వదలకుండా కొన్నమని హరీశ్‌రావు తెలిపారు.