ది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపక డైరెక్టర్ ప్రాఫెసర్ పీఎం భార్గవ (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మృతి చెందారు. హైదరాబాద్ ఉప్పల్ లోని ప్రశాంత్ నగర్ లోని ఆయన నివాసంలో భార్గవ పార్థివదేహాన్ని ఉంచారు. కాగా, పీఎం భార్గవకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928, ఫిబ్రవరి 22న అజ్మీర్ లో భార్గవ జన్మించారు. 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్ డీ పట్టా సాధించిన ఘనత ఆయనది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వైస్ చైర్మన్ గానూ ఆయన పని చేశారు. 1986లో పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది.