బెంగళూరు: గుజరాత్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. రాష్ట్రంలో ఇటీవల సంక్షోభానికి గురైన కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఎమ్మెల్యేలు ఉంటున్న గదుల్లో ఐటీ శాఖ సోదాలు చేపడుతోంది. తొలుత కర్ణాటక మంత్రి ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు.. తర్వాతే ఎమ్మెల్యేల గదులను కూడా సోదాలు చేస్తున్నారు.
కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇంటిపై బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడి చేశారు. కనకపురాలోని సదాశివనగర్‌లో మంత్రి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి ఇంటికి సమీపంలో గల ఈగల్‌టన్ గోల్ఫ్ రిసార్ట్‌లో ఉంటున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల గదులను కూడా తనిఖీలు చేస్తున్నారు. కాగా.. గుజరాత్ నుంచి బెంగళూరు చేరుకున్న 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి శివకుమార్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మిగతా ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించింది. త్వరలో గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాజపా నుంచి అమిత్‌షా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ బరిలో ఉన్నారు.