ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్‌కు 5వ స్థానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 11:43 AM

వివిధ అంశాలకు సంబంధిన పనితీరులో దేశంలోనే హైదరాబాద్‌కు 5వ ర్యాంకు లభించింది. ప్రతి ఏడాది దేశంలోని వివిధ నగరాల పనితీరును అధ్యయనం చేసి జనాగ్రహ్ అనే సర్వే సంస్థ ర్యాంకులను ప్రకటిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 80 అంశాలను పరిగణనలోకి తీసుకొని, దేశంలోని 21 నగరాల్లో అధ్యయనం చేసి ఈ ఏడాది ర్యాంకులను మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది.గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మొదటి స్థానంలో తిరువనంతపురం నిలిచింది. ఆ తర్వాత పుణె, కోల్‌కతా, ముంబై నగరాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరం ఐదో స్థానంలో నిలిచింది. ఒక్కో నగరం 80 అంశాల్లో సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని గరిష్ఠంగా 10 మార్కులను ఇవ్వగా మొదటి స్థానంలో నిలిచిన తిరువనంతపురం 4.4 మార్కులను సాధించగా, హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నా 3.9 మార్కులను పొందడం గమనార్హం. అయితే, పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో హైదరాబాద్‌కు రెండో స్థానం, పట్టణ ప్రణాళికలో నాలుగో స్థానం లభించింది. సర్వే ఫలితాలను మంగళవారం ఢిల్లీలో జనాగ్రహ్ సంస్థ సీఈవో విశ్వనాథన్ మీడియాకు వెల్లడించారు.
నగరాల్లోని పరిపాలన వ్యవస్థ, పౌరులకు అందుతున్న సౌకర్యాలు, నగర పరిపాలన సంస్థల నిర్వహణ తీరు, రోడ్లు, ఇండ్ల ప్రణాళిక, నగరాల్లోని వనరులు, సామర్థ్యం, విధానాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, స్థానిక సంస్థల ప్రతినిధుల బాధ్యత ఇలా అనేక అంశాలను అధ్యయనం చేశామని ఆయన చెప్పారు. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఆయా నగరపాలక సంస్థలు చేపట్టిన సింగిల్ విండో విధానం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోల్చినప్పుడు ఈ నగరాల స్థానం తదితరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు. పట్టణ ప్రణాళికలో ఢిల్లీ 3.7 మార్కులతో తొలి స్థానంలో నిలువగా, భువనేశ్వర్(3.1), కోల్‌కతా (3.0) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నగరం 2.9 మార్కులతో నాలుగో స్థానంలో నిలువగా, చండీగఢ్ 0.6 మార్కులతో 21వ స్థానంలో నిలిచింది. పట్టణాల్లోని వనరులు, సామర్థ్యం విభాగంలో ముంబై నగరం 5.2 మార్కులతో తొలి స్థానంలో నిలువగా హైదరాబాద్ 3.2 మార్కులతో పదో స్థానంలో నిలిచింది. ప్రజా ప్రతినిధుల పనితీరు, జవాబుదారీతనం తదితర అంశాల్లో తిరువనంతపురం 6.4 మార్కులతో తొలి స్థానంలో నిలువగా 3.3 మార్కులతో హైదరాబాద్ నగరం 19వ స్థానంలో నిలిచింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa