హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఎన్‌సీబీ అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి ఆధారాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు సిట్ 11 కేసుల్లో 22 మందిని అరెస్టుచేసిందని స్పష్టంచేశారు. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే విచారించిన సినీ ప్రముఖులు సాక్షులా, నిందితులా అనేది ఇప్పుడే చెప్పలేమని, వారి విషయంలో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని అన్నారు.
డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని అకున్ తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురు చేస్తున్నట్టు చెప్పారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని, సిట్ చేస్తోన్న దర్యాప్తునకు ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని అన్నారు. పాఠశాలల్లో గురువులు విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని సూచించారు. ఇప్పటివరకు విద్యార్థులు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. సామాజిక బాధ్యతతోనే డ్రగ్స్ దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తున్నామని, డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని అన్నారు.