రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సర్దాపూర్ లో గోదాములు, పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. దేశానికే పాఠాలు నేర్పే విధంగా రాష్ర్ట ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. రాష్ర్టంలో రైతులకు రూ. 17 వేల కోట్లు రుణాలు మాఫీ చేశామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రుణమాఫీపై పంజాబ్ ప్రభుత్వం రాష్ర్టంలో అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల పథకాలు చేపట్టారని తెలిపారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కు దిక్కు లేదు. ఎరువులు, విత్తనాలు సకాలంలో రావు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులు కరెంట్ కోసం ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామని కేటీఆర్ తెలిపారు. ఈ సారి తప్పకుండా వర్షాలు భారీగా పడుతాయన్న ఆయన.. రైతుల ముఖాల్లో తప్పక సంతోషం చూస్తామన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు కలిసి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.