ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ షూరూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:05 AM

 -తొలి విడత 10 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
 -పార్టీ కోసం పని చేసిన వారికే పెద్దపీట
 -ఇక  జిల్లాస్థాయి పదవుల నియామకానికి కసరత్తు
 -జిల్లా గ్రంథాలయ సంస్థ, దేవాలయ కమిటీల నియామకం
 -దృష్టి సారించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : గత రెండున్నర ఏళ్లుగా ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న  నామినేటెడ్‌ పోస్టులను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ భర్తీ చేశారు. ఏకంగా 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఇప్పటి వరకూ  అదిగో, ఇదిగో  అంటూ దాటవేసుకుంటు వస్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్‌,  నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే.  దానిలో భాగంగానే తొలివిడుత 10 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడుతగా  రాష్టస్థ్రాయి కార్పొరేషన్లకు చైర్మన్ల  నియమించిన ఆయన, మలివిడుత జిల్లాస్థాయి నామినేటెడ్‌ పదవులను భర్తీ ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు  నాలుగువేల నామినేటెడ్‌ పదవులున్నట్లు, వాటిని  భర్తీ చేయడం ద్వారా ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు పదవులు దక్కుతాయని కేసీఆర్‌ భావిస్తున్నారు. మలివిడత  జిల్లాల వారీగా నామినేటెడ్‌ పదవుల  భర్తీ ప్రక్రియకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల  మంత్రులను ఆదేశించారు. మార్చి మొదటివారంలో  అసెంబ్లీ  బడ్జెట్‌ సమావేశాలలోపే నామినేటెడ్‌  పదవులను భర్తీ చేయాలని ఆయన యోచిస్తున్నారు.   ముఖ్యమంత్రి నిర్ణయంతో  గత రెండున్నర ఏళ్లుగా  టీఆర్‌ఎస్‌ నేతలను  ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులు భర్తీకి ఎట్టకేలకు మోక్షం లభించనుండడంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జూన్‌ 2 వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తవుతుందని,  ఈలోగానే  నామినేటెడ్‌ పోసులన్నీ  భర్తీ చేయడం ద్వారా  పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించి, బుధవారం తొలి విడుత పెద్దసంఖ్యలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్లకు దాదాపు ఇప్పటికే అన్నింటికి చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు ఇక  జిల్లా స్థాయి నామినేడెట్‌ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. జిల్లాస్థాయి పోస్టులను భర్తీ చేయడం ద్వారా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి పదవులు కల్పించాలని గులాబీదళపతి నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలకవర్గాన్ని నియమించేందుకు కేసీఆర్‌ ఆయా జిల్లాల మంత్రుల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. అదే సమయంలో  జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్లను నియమించాలని నిర్ణయించారు.  దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని దేవాలయాలకు కమిటీలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీలు, జిల్లా గ్రంధాలయసంస్థల చైర్మన్లు, దేవాలయకమిటీ పాలక మండళ్లను నియమించే సమయంలో  పార్టీ కోసం పని చేసిన వారిలో సమర్ధులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణలను కూడా పరిశీలించాలని మంత్రులకు  సూచించారు.  ఎవరినీ నిరుత్సాహపరచకుండా అందరి నుంచి ప్రతిపాదనదలు తీసుకుంటే, పరిశీలించి ఎంపిక చేయవచ్చని మంత్రులకు  కేసీఆర్‌ సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ జిల్లాల్లో పార్టీ కార్యకర్తల  సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   నామినేటెడ్‌ పోస్టుల్లో ఎక్కువ భాగం బడ్జెట్‌ సమావేశాలలోపు  భర్తీ చేయాలని భావిస్తున్న కేసీఆర్‌, మలివిడతగా మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్లను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  అయితే మరికొన్ని పదవులు  మాత్రంరాషా్టవ్రతరణ దినోత్సవం జూన్‌ 2 లోగా పూర్తి చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa