ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:39 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అందుకోసం మార్చి 3 నుంచి ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం దీక్షలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కులాల అభివృద్దిని పక్కనబెట్టి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలకు రిజర్వేషన్లు పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున మావంటి అత్యల్ప కులాల వారికి న్యాయం జరుగుతుందని, రిజర్వేషన్‌ ఫలితాలు దక్కుతాయన్న ఆశతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలిసి విన్నవించినా ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 150 బీసీ కులాలలో దాదాపు 30 కులాల వారికి ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల గురించి తెలియదన్నారు. గంగిరెద్దుల, బాలసంతు, పిచ్చుకుంట్ల, కాటిపాపల, రజక, మంగళి, వడ్డెర, బెస్త, కాచెబారు వంటి కులాలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అత్యల్పంగా ఉన్నారని, సరాసరి వెయ్యి మందిలో ఒక్కరు కూడా లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకంటే అత్యంత వెనుకబడిన ఈ అత్యల్ప కులాల వారికి ఆర్థిక స్థోమత లేని కారణంగా విద్యకు దూరంగా ఉన్నారని దాని ఫలితంగా ఇంకా వారు అన్ని రంగాలలో అట్టడుగున కొనసాగుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌ కులాన్ని బీసీ ఏ జాబితాలో చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయానికి తాము వ్యతిరేకం కాదని, గత 40 ఏళ్లుగా వడ్దెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని తాము చేస్తున్న న్యాయమైన డిమాండ్‌ను పట్టించుకున్న నాథుడే లేడని ఆయన వాపోయారు. ఆర్థికంగా చితికిన కారణంగా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నిక కావాలన్న కల.. తమ సామాజిక వర్గానికి అందని ద్రాక్షగానే మిగిలిపోయిందన్నారు. అత్యల్ప కులాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, వారికి చేయూత నివ్వాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వేముల వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు.  ఈకార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు ఎత్తరి మారయ్య, పల్లెపు శివకుమార్‌, పల్లెపు రమేశ్‌, పల్లెపు గణేశ్‌, డి.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa