ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెలుపు సులభం కాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 01:03 AM

 ఎపుడూ అధికార పక్షానికి పెనుసవాలే


 ఫలితాల్లో ప్రతిబింబించడం దాదాపుగా కష్టమే


 అనుకూలంగా ఉండబోతోందనేది సందిగ్ధం


 ఆశల్ని నాశనం చేస్తుందనే బెంగ లేకపోలేదు


 మూడు పక్షాల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది


ఎన్నికలు ఎపుడు జరిగినా.. ఎలా జరిగినా.. అసెంబ్లీ అయినా.. పార్లమెంట్‌ అయినా.. ఎపుడూ అధికార పక్షానికి పెనుసవాలే! ముఖ్యంగా మన దేశంలో మొగ్గు ఎటు ఉంటుందో.. ఓటరన్న ఎవ రికి మొట్టికాయలు వేస్తాడో.. అంచనా వేయడం దాదాపు అసాధ్యమే. ఎన్నికల సమయంలో జరిపే సర్వేలు.. ఎన్నికల ప్రచారాల్లో నేతలు చెప్పే కబుర్లకు పడే చప్పట్లూ.. ఫలితాల్లో ప్రతిబింబించడం దాదాపుగా కష్టమే. ఎందుకంటే మన దేశంలో ఓటు వేసేవారిలో దాదాపు పదిహేను శాతం మంది ఓటు వేసే క్షణంలోనే తామెవరికి ఓటేయాలన్నది నిర్ణయించుకుంటారు. వీరినే తటస్థ ఓటర్లంటారు. ఏ ఎన్నికల్లో అయినా ఈ ఓట్లే కీలకంగా మారతాయి. ఇదే గాలి మళ్లిందనే వార్తకు ఆధారం అవుతాయి. అప్పటి వరకూ నల్లేరు మీద నడకలా కన్పించిన ఎన్నికల తంత్రా లు.. ఒక్క క్షణంలో మారిపోతాయి. ఇదంతా ఇపుడెందుకంటే.. దేశంలోనే అతిపెద్ద రాష్ర్టమైన ఉత్తర ప్రదేశ్‌ రాష్ర్ట శాసనసభకు ఎన్నికలు జరుగుతు న్నాయి. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గం కూడా ఈ రాష్ర్టంలోనే ఉంది. అందుకే ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకున్నాయి. కులాలు, మతాలు, బడుగు వర్గాలు, అగ్ర వర్ణాలు, ఉద్యోగస్థులు, నిరుద్యోగులు ఇలా ఎన్నో రకాలైన ప్రజల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోందనేది సందిగ్ధంగానే ఉంది. ఈ ఎన్నికలు కేంద్రంలోని అధికార పార్టీకి నిజంగా సవాలుగానే నిలిచాయి. కేంద్రంలో బీజేపీ అధికారం సాధించిన రెండున్నరేళ్లకు ఈ ఎన్నికలు రావడం అందరిలోనూ ఫలితాలపై కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. రెండున్నరేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పనులకు ఇదొక రిఫరెండంగా చాలా మంది పరిగణిస్తున్నారు. రిఫరెండం స్థాయిలో కాకపోయినా.. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ విధానాలకు కొంత వరకూ ప్రజల ప్రతిస్పందనగానే భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పెద్ద నోట్ల రద్దు అంశానికి ప్రజల్లో ఏవిధమైన స్పందన వచ్చిందో ఈ ఎన్నికల ఫలితాలు తేల్చిచెపుతాయని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా శాసనసభ ఎన్నికల్లో స్థానికంగా అధికార పార్టీకి ఉండే ప్రజా వ్యతిరేక ఓటు ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిఫలిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. దేశంలో అధికారాన్ని సాధించడానికి అవసరమైన పార్లమెంట్‌ స్థానాల్లో మూడింట ఒక వంతు (72 స్థానాలు) ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం నుంచే బీజేపీ కి వచ్చాయి. ఈ కోణంలో చూస్తే.. వారి అభిప్రాయం సరైనదే అనిపిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్‌ విషయంలో ఎన్నికలంటే కులాల కురుక్షేత్రం లాంటిదే. ప్రతి ఎన్నికల్లోనూ కుల సమీకరణాలే ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. ఈ సారీ దానికి భిన్నంగా పరిస్థితులు ఉంటాయని చెప్పలేం. కానీ, ఈ సారి ఎన్నికల్లో కొన్ని గమ్మత్తులు చోటు చేసుకున్నాయి. స్వయంగా ప్రధాన మంత్రి ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో ముందుకు దూకడం బీజేపీ వైపున్న విశేషం. అదే సమయంలో బీజేపీలో మోదీ ఎదుగుదలని సహించలేని శక్తులన్నీ తమ పార్టీ పుట్టెముంచడానికి సమాయత్తమవుతున్న సంకేతాలు ఆ పార్టీకి ఇబ్బంది కరంగానే మారాయి. ఇక అధికార సమాజ్‌వాదీ పార్టీ పరిస్థితి మరింత గందరగోళం. వారసత్వ రాజకీయాల్లో ములాయం సింగ్‌ కుటుం బంలో రేగిన చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారిన పరిస్థితి ఇప్పటికీ కనిపించడం లేదు. కాంగ్రెస్‌తో చెలిమి ఇపుడు సమాజ్‌వాదీ పార్టీకి బలంగా మారుతుందనే నమ్మకంతో ఉన్నప్పటికీ.. ఇంటి రచ్చ ఏ రకంగా ఆ ఆశల్ని నాశనం చేస్తుందో అనే బెంగా ఆ పార్టీకి ఉంది. ఇక, బీఎస్పీ ఈ ఎన్నికల్లో ముందంజలో ఉంటామనే అంచనాతో ఉంది. కానీ, అది అంత తేలికగా కనిపించడం లేదు. ఏతావాతా మూడు పక్షాల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. 


విభిన్న ఫలితాల సర్వేలు : ఈ పోరులో గెలుపు ఎవరికీ అంత ఈజీ కాదనేది సత్యం. ఇక్కడ గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం ఇలా అనేకంటే మోదీ మం్త్రం అన్ని రాజకీయ పక్షాల్నీ కుదేలు చేసేసింది. 80 స్థానాల్లో 72 స్థానాల్ని బీజేపీకి కట్టబెట్టారు ఇక్కడి ఓటర్లు. ఇపుడు కూడా అదే పునరావృతమవుతుందని బీజేపీ నమ్ముతోంది. కానీ, అది సాధ్యం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రాష్ర్టంలో ఉన్న సెంటిమెంట్‌ వేరు. ఇపుడు వేరనేది వారి అంచనా. అదీకాక.. మోదీ విధానాల్ని సామాన్య జనం వ్యతిరేకిస్తున్నారనీ.. అది ఈ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందనీ వారిలెక్క. అయితే.. బీజేపీ మాత్రం ఇదంతా ఒట్టిదేనని కొట్టి పారేస్తోంది. మోదీ నాయకత్వ ప్రతిభ కే ఓట్లు రాలతాయని కుండబద్దలు కొట్టినట్టు చాటుతోంది. నిజానికి స్థానిక పరిస్థితుల ఆధారంగానే శాసనసభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఉంటుంది. రెండున్నరేళ్లలో మోదీ చూపించిన అభివృద్ధి లేదా వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ సమయాల్లో వివిధ పక్షాలు జరిపిన సర్వేల్లో రకరకాల ఫలితాలు వచ్చాయి. ఏడాది క్రితం సర్వేలో బీఎస్పీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నదని సర్వేలు వెల్లడించాయి. తరువాత నాలుగు నెలలు తిరగకముందే నిర్వహించిన మరో సర్వేఎస్పీ కాంగ్రెస్‌ కూటమికే విజయావకాశాలున్నాయని తేల్చింది. ఈ రెండు సర్వేల్లో కూడా బీజేపీకి ఆధిక్యం కనిపించకపోవడం విశేషం. ఇక ఎన్నికలు సమీపించే కొలదీ వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో ఫలితాలు మాత్రం వివిధరకాలుగా కనిపించడం విశేషం. దీంతో సర్వేల అంచనా ఎంతవరకూ సరైందన్న సందిగ్ధం ఏర్పడింది. 


సుదీర్ఘ ప్రక్రియా ప్రభావం : ఇక ఇక్కడ ఎన్నికలు దాదాపు నెల రోజుల పాటు 5 అంచెల్లో నిర్వహిస్తుండడమూ కొంత ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే, ఈ సుదీర్ఘ కాలంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కూడా పోలింగ్‌ సరళిపై.. ముఖ్యంగా తటస్థ ఓటర్ల ఓటింగ్‌ విధానంపై తీప్ర ప్రభావం చూపిస్తుంది. వీరి మొగ్గు ప్రతి అంచెలోనూ మారిపోయే అవకాశాల్నీ కొట్టి పారేయలేము. అదే జరిగితే.. ఇక్కడ హంగ్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువవుతాయి. ఈ వాదననూ వ్యతిరేకించేవారున్నప్పటికీ పూర్తిగా దీనిని తీసిపారేయకపోవడం విశేషం.


ప్రచార సరళి : హుందాగా ప్రారంభమైన ఎన్నికల ప్రచారం తిట్ల పురాణంతో వేడెక్కింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా.. అన్ని పార్టీలూ.. వీరూ వారూ అని కాకుండా అందరు నాయకులూ ఒకరిపై ఒకరు తీవ్రంగా దుమ్మెత్తి పోసుకున్నారు. ఒక పక్క హామీల వర్షం.. మరో పక్క ఎదుటి పక్షంపై మాటల దాడి.. ఇదే విధంగా ప్రచార సరళి సాగింది. ఎక్కడా కూడా ప్రజాప్రయోజనాల చర్చ తలెత్తలేదు. ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంలో విపరీతమైన ఆసక్తి చూపించారు. స్వయంగా ప్రధానే ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిని ఉద్దేశించి స్కాం అని సంబోధిస్తూ.. అవినీతికి ట్రేడ్‌మార్‌‌క అని విమర్శించడం ఇక్కడ గమనార్హం. ఇక ప్రజాకర్షక హామీల విషయంలో ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరు ప్రజా మనసుల్ని కొల్లగొట్టిన హీరోలో తెల్సిపోతుంది. కానీ, ఇంత సుదీర్ఘ ప్రక్రియలో.. ఇంత హడావుడిలో.. ఓటరన్న తీర్పు ఏ పార్టీ పుట్టె ముంచుతుందనేది ఆసక్తి కలిగించే విషయమే. కొసమెరుపు ఏమిటంటే స్వయంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీకీ తీవ్రమైన ఎదురుగాలులు వీస్తున్నాయన్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మోదీని వ్యతిరేకిస్తున్న సంఘ్‌ పరివార్‌లో కొందరు అక్కడ బీజేపీ పరాజయం కోసం పనిచేస్తున్నారన్న గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటమి వల్ల మోదీకి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏమీ లేకపోయినా రానున్న కాలంలో ఆయన తీసుకునే నిర్ణయాలై ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తాయన్నది మాత్రం నిజం. 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa