ఉద్యమకాలంలో కోదండరాం సార్ కులం తెలియదా?
ప్రశ్నలడిగే వారి వెనుక ఉన్నదెవరు?
ఎవరడిగించినా అడుగుతున్నది కరెక్టేనా?
తెలంగాణ ఉద్యమానికి ముందు కోదండరాం ఉద్యమకారుడు కాదా?
తెలంగాణ సమాజం కోదండరాం ను కులకోణం నుంచి చూస్తుందా?
కోదండరాం సారుగానే తెలంగాణ సమాజానికి తెలిసిన ఒక ప్రొఫెసర్ ఇప్పుడు కోదండరాం రెడ్డి అయిపోయారు. ఆయన్ను ఇప్పుడు రెడ్డి గానే చాలా మంది సంబోదిస్తున్నారు. ఆయన ఏది చేసినా ఆ కోణంలోనే చూస్తున్నారు. ఆయన పక్కన ఏ పార్టీ రెడ్డి నిలబడ్డా ఇగో చూశారా రెడ్డీలంతా ఐఖ్యమవుతున్నారు అంటూ అరిచిగోల పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకుకెళ్ళి సారు సంగతేందో చూస్తమంటున్నరు. ఇందులో ప్రధానంగా తీసుకోవాల్సింది. డాక్టర్ సాబ్ ను ఆయనే మన చెరుకు సుధాకర్ గారు.
కోదండరాం ఉద్యమం అన్నప్పటి నుంచి చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో విమర్శలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. ఆయన రెడ్ల కోసమే పనిచేస్తున్నారంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన మాత్రం ఎన్నం శ్రీనివాసరెడ్డి ని ఎంబడేసుకునే తిరుగుతున్నడు. ఇక మరో అంశం ఇటీవలే జెఏసి నాయకులు పిట్టల రవీందర్, ప్రహళాద్ లు రాసిన లేఖ ఈ అంశంలో ప్రధానమైనది కోదండరాం పార్టీ పెడతారన్న అంశం గురించి . కోదండరాం పార్టీ పెడతారన్న వార్తలు ఇప్పుడే కొత్తగా వచ్చినవేమీ కాదు. ఆయన పోరాటం ప్రారంభించినప్పటి నుంచి వినవస్తున్న మాటలే.. భూనిర్వాసితుల కోసం గ్రామగ్రామాని తిరుగుతున్నపుడే పార్టీ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై నేను హెచ్‌ఎంటివి లో ఇన్‌పుట్ ఎడిటర్‌గా ఆయన్ను ఇంటర్వూ్య చేస్తూ రాజకీయపార్టీ గురించి సూటిగానే ప్రశ్నించాను. ఒక గంటపాటు జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి కూడా ఇలాంటి ప్రశ్నలే వచ్చాయి. అయితే ఎక్కడా కోదండరాం పార్టీ పెడుతున్నట్లు నేరుగా ప్రకటించలేదు.
ఉద్యమాలు చేస్తూ పోవడమే తమ కర్తవ్యంగా చెప్పారు. రాజకీయపార్టీ రావాల్సి వచ్చినపుడు అవసరం వస్తే అదే వస్తుందన్నారు. అది ఎవరితోనైనా కావచ్చన్నారు తప్ప తాను పార్టీ పెడుతున్నట్లు చెప్పలేదు. అప్పుడు కూడా ఇదే అంశం ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ తరహాలో పార్టీ పెడుతున్నారని ఢిల్లీ నుంచి కొందరు నేతలు వచ్చి కోదండరాం తో సమావేశమయ్యారని చాలా వార్తలొచ్చాయి. నిజానికి ఇప్పటికంటే అప్పుడే రాజకీయపార్టీ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. నిర్వాసితుల ధర్నా సమయంలోనే కోదండరాం ఎక్కువ రాజకీయ కార్యకలాపాలు సాగించారు. అన్ని పార్టీల నేతలతో కలిసారు. వారితో సమావేశాలు పెట్టారు. ప్రభుత్వానికి ముచ్చెమటలు పోసే విధంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. అయితే ఇప్పుడు ప్రశ్నిస్తున్న నేతలు అప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. సారు ఇదేంది రాజకీయపార్టీ అంటున్నరు దీని సంగతేందని అప్పుడు అడగనే లేదు. ఎందుకోమరి
ఇప్పుడు నిరుద్యోగుల ర్యాలీ అనగానే గ్రామగ్రామాన నిరుద్యోగ యువకులు కదలివచ్చారు. జెఎసి పోరాటంలో పాలు పంచుకునేందుకు సిద్దపడ్డారు. ఇప్పుడు కూడా అదే విధమైన రాజకీయ వార్తలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నా అధ్యక్షతన కోదండరాం తో మీట్ ద ప్రెస్ నిర్వహించాము. దీనికి చాలా మంది పత్రికా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జెఎసి కో ఛైర్మన్ హోదాలో ప్రహళాద్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ కూడా విలేకరుల నుంచి అవే ప్రశ్నలు.
పార్టీ పెడతారా.... రాజకీయాల్లోకి వెళతారా... దీనిపై కోదండరాం సార్ కుండబద్దలు కొట్టినట్లే చెప్పారు. పార్టీ అంటే వస్తే రావచ్చు కానీ జెఎసి మాత్రం కొనసాగుతుంది. చివరకు తాను వెళ్ళిపోయినా జెఎసి తెలంగాణ ప్రజల పక్షాన నడుస్తుందని స్పష్టం చేశారు. జెఎసి పార్టీగా మారే అవకాశాలు లేవని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ జెఎసి ప్రకారం విజయవంతమయింది. ప్రభుత్వం ప్రకారం విఫలమైంది. ఏదో జరిగిపోయింది. ఆ తరువాతే ఈ రాజకీయ నాటకం ఎందుకు ప్రారంభమైంది. ఇవన్నీ ప్రజాస్వామిక వాదులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
కలుపుకుపోని కోదండరాం :
నిజమే కోదండరాం కొందరని కలుపుకు పోవడం లేదన్న విమర్శలు బలంగా వినిపించడానికి కారణాలున్నాయి. సకలజనుల సర్వే లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50, 03,674 ఇందులో బిసిల సంఖ్య 1,88,41,009, యస్సీలు 54,08,800, యస్టీలు 31,77,940, మైనార్టీలు 53,72,197 ( పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా) మంది ఉన్నారు. ఇలా జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బడుగు, బలహీనవర్గాలను పరిగణనలోకి తీసుకోకుండా, వారి నాయకత్వాన్ని పెంచకుండా ముందుకు పోతుండటంతోనే ఎక్కువగా విమర్శల పాలు కావాల్సి వస్తున్నది. ప్రస్తుతం విమర్శిస్తున్న నేతలు కూడా బడుగు, బలహీన వర్గాల నేతలే కావడం గమనార్హం. వారడుగుతున్న అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత కోదండరాం పై ఉంది. అలా కాకుండా వారి విమర్శలను పట్టించుకోకుండా ముందుకు పోవచ్చు. కానీ అలా పోయే క్రమంలో వారు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా ఇవ్వక పోతే ఉద్యమం కానీ, రేపు రాబోయే రాజకీయపార్టీ గానీ ముందుకు సాగవన్న విషయం కోదండరాం కు తెలియనిదేమీ కాదు.
ప్రశ్నల్లో రాజకీయ కోణాలుండవచ్చు :
ఇప్పుడు కొందరు వేస్తున్న ప్రశ్నల్లో రాజకీయకోణాలు ఉండవచ్చు. అధికార పార్టీ వారిని దగ్గరకు తీసుకోవచ్చు. వారికి పదవులు కూడా ఇవ్వొచ్చు. ఆర్థికంగా సహాకారం అందిచ్చవచ్చు ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి వారడిగే ఏ ప్రశ్నలు సరైనవి కావని చెప్పలేం. ఇంతవరకు ఎందుకడగలేదు. ఇప్పుడెందుకు అడుగుతున్నారని మాత్రం అడగొచ్చు. అయితే ఇంతవరకు అడగలేదు కాబట్టి ఆ ప్రశ్నలకు విలువలేదని కూడా అనుకోలేం. ఎందుకంటే ఇకముందు కోదండరాం కు వచ్చే ప్రశ్నలన్నీ ఇలాంటివే... వాస్తవంగా చెప్పాలంటే ఫేస్‌బుక్కుల్లో, వార్డ్సప్ లలో కోదండరాం పైనా, ఆయన కులం పైనా అనేక ప్రశ్నలు వచ్చాయి. అయితే వాటికి పత్రికలు అ ంతగా విలువివ్వలేదు. కానీ కోదండరాం బృందం నుంచే ఈ ప్రశ్నలు వస్తుండటంతో వాటికి విలువ పెరిగింది. జెఎసి సామాజిక న్యాయం ఆధారంగానే ప్రారంభమైందని కోదండరాం పదేపదే చెపుతూనే ఉన్నారు. కానీ ఆచరణ విషయంలో ముందుకు పోలేదన్నది వాస్తవమే.. అలాగని కోదండరాం తెలంగాణ కోసం ఏమీ చేయలేదన్న ఆయన మిత్రుల ప్రశ్న కూడా సరైంది కాదు. ఇప్పుడు ప్రశ్నలడిగిన మిత్రలు గతంలో తమతమ వృత్తులు చూసుకుంటూనే ఉద్యమాలు నిర్వహించారు. ఆ లెక్కన కోదండరాం కూడా బాలగోపాల్ సార్ అడుగుజాడల్లో నడిచి పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే తెరపైకి వచ్చిన వ్యక్తేమీ కాదు. ఇప్పుడు ప్రశ్నలు వేసిన ఆయన సహచరులది కోదండరాం ది ఒకే సిద్దాంత పునాది. విప్లవోద్యమాల నుంచే వారి మద్య సాన్నిహిత్యం నెలకొని ఉంది. అలాంటి వారు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నల వెనుక ఎవరో ఉండే ఉంటారన్న అనుమానం అందరిలోను ఉంది. బహుశా అది నిజమే కావచ్చు కూడా. కానీ ఆ ప్రశ్నలకు మాత్రం కోదండరాం జవాబు చెప్పాల్సిందే... ఒక కులంలో పుట్టడం ఎవరిచేతుల్లోను ఉండదు కానీ కులంలో పుట్టిన తరువాత చేస్తున్న పనుల ద్వారానే వ్యక్తిత్వం బయటపడుతుంది. అలా కోదండరాం కు ఒక కుల దురహంకారాన్ని అంటగట్టడం సరికాదు కానీ... ఆయన ఇప్పుడు ఉద్యమ నేతగా రాబోయే రోజుల్లో రాజకీయ నేతగా సమాజంలోని 90 శాతం జనాభాను ఆయన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
కోదండ రాం సార్ కు ఓ ప్రశ్న... అందరూ ప్రశ్నలు వేస్తున్నారు. నేను కూడా ఓ ప్రశ్న వేద్దామన్న ఉద్దే శంతో వేస్తున్న ప్రశ్న కాదు. కోదండరాం సార్ తో చిరకాలంగా ఉన్న మిత్రులు , ఆయన సిద్దాంత భూమికను తెలిసిన వారు, ఉద్యమంలో వెన్నంటి ఉండి తెలంగాణ వచ్చేదాకా ఆయన నాయకత్వంలో పనిచేసిన వారు, ఆయన్ను ఎవరేమన్నా ఇంతెత్తున విరుచుపడే వ్యక్తులే ఇప్పుడు ఎందుకని కోదండరాం సార్ ను ప్రశ్నిస్తు న్నారని సారునే అడుగుదామనుకున్న అందుకే సారుకే ఈ ప్రశ్న
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa