-తెలంగాణలో టిడిపి, వైసిపిలను క్లోజ్ చేసిన కెసిఆర్
-హస్తం పార్టీ నేతలకు గాలం వేస్తున్న టిఆర్‌ఎస్ ముఖ్యులు
-కెసిఆర్ హామీలతో క్యూ కడుతున్న కాంగ్రెస్ నేతలు
-నల్గొండ జిల్లాలో భారీ ఆపరేషన్‌కు శ్రీకారం
-ఎంపితో పాటు ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్
-మరికొందరి నేతలతో చర్చలు జరుపుతున్న టిఆర్‌ఎస్
-హరీశ్‌రావుతో టచ్‌లో ఉన్న ప్రజాప్రతినిధులు
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధిః తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరుతో టిఆర్‌ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్‌ష విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు అరడజను మంది ఎమ్మెల్సీలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అకాల మరణం చెందారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో పాటు మరికొందరు టిఆర్‌ఎస్‌లో చేరారు. అన్ని కుదిరితే రేపో, మాపో మరికొంద రు కండువా మార్చేందుకు సిద్దంగా ఉన్నారని నల్గొండ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా నాయకుల వ్యవహరశైలి కూడ ఉండడంతో త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుందని సమాచారం. పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డిలు ఆ జిల్లాకు చెందిన వారైనప్పటకి వలసలను నిరోదించడంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. ఈ భారీ ఆపరేషన్‌కు సీనియర్ మంత్రి హరీశ్‌రావు నేతృత్వం వహిస్తున్నట్లు టాక్. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో టిడిపి పై ఫోకస్ చేసిన టిఆర్‌ఎస్ ఆ పార్టీ శాసన సభాపక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసుకుంది. మండలిలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా చేయగలిగింది. ప్రస్తుత అసెంబ్లీలో టిడిపి బలం మూడుకు పడిపోయింది. వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఎంపి వైసిపి రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడ గులాబీ కండువా కప్పుకున్నారు. బిఎస్‌పికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలు టిఆర్‌ఎస్‌లోకి జంప్ అయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ లోకి మారారు.
పార్టీ నుండి బయటకు వెళ్లేందుకు సిద్దమైన సీనియర్‌నేతలు
కాంగ్రెస్ పార్టీని కుంగదీస్తున్న వరుస ఓటములు
తెలంగాణలో అధికారంలోకి రాకపోయిన కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్‌తో సహ ఆరుగురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చేశారు. తాజాగా నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పాలమూరు జిల్లాకు చెందిన మరో శాసనసభ్యుడు కూడ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తదితరులు కండువాలు మార్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. వారం రోజులలోనే వారంతా టిఆర్‌ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కాస్తా బలంగా ఉన్న నల్గొండ, పాలమూరు జిల్లాల నుండి కూడ వలసలు మొదలు కావడంతో ఇది ఎక్కడి వరకు దారితీస్తుందనే చర్చ పార్టీ నేతలలో కొనసాగుతుంది. పార్టీపై కాస్తా అసంతృప్తిగా ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్న టిఆర్‌ఎస్ నేతలు వారికి గులాబీ కండువాలు కప్పేందుకు రెఢీ అవుతున్నారు. ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ఇబ్బందులలో పడడం ఖాయమనుకున్న నేతలంతా ఇతర పార్టీలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉత్తమ్, జానారెడ్డిల నేతృత్వంలో వరుస వైఫల్యాలు
గత సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత పిసిసి అధ్యక్షులుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య స్థానంలో పిసిసి చీఫ్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. ఆయన నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికలలోను కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగ ట్టుకుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో పోరాట కార్యక్రమాలను నిర్వహించాల్సిన పిసిసి ఎక్కడ కూడ తన కార్యాచరణలో ఆ పనిని చేయలేదు. నాయకులు, క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతున్న వారిలో ధైర్యం నింపే కార్యక్రమాలు చేయడం లేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రతిపక్ష పార్టీ అడుగడుగునా అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేస్తుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ స్వప్రయోజనాల కోసం పార్టీ భవిష్యత్‌ను తాకట్టు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏ మాత్రం సామాజిక న్యాయాన్ని పట్టించుకోని ఎఐసిసి పెద్దలు పిసిసి చీఫ్ తో పాటు సిఎల్‌పి నేత వంటి పదవులు ఒకే జిల్లాకు చెందిన, ఒకే సామాజిక వర్గ నేతలకు అప్పగించడం పై పలువురు నేతలు మండిపడుతు న్నారు. వీరిద్దరు పార్టిని ముందుకు నడపడంలో తీవ్రంగా వైఫల్యం చెందారని విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్షాన్ని ఏకతాటిపై నడపడంలో జానారెడ్డి దారుణంగా విఫలమవుతున్నారు. పలు సందర్బాలలో అధికార పక్షాన్ని ఇబ్బందులలో పెట్టడానికి బదులు పొగిడారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. ఇవన్ని అవకాశాలుగా మలుచుకుంటున్న టిఆర్‌ఎస్ పెద్దలు కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్ చేపట్టిన ఈ ఆపరేషన్ ఆకర్‌ష అన్ని పార్టీలను ఖాళీ చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ వరకు విజయవంతంగా కొనసాగుతుంది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa