-ట్రంప్ కొత్త ఆదేశాల్లో ఏముంది?
-కోర్టులో సవాల్‌చేసే అవకాశం ఉందంటున్న నిపుణులు
-బాధితులకు న్యాయం చేస్తాం: హామీ ఇచ్చిన అమెరికా
-ఇండియాలో జాగ్రత్త : హెచ్చరించిన యూఎస్ ప్రభుత్వం
-ఇప్పుడు న్యూజిలాండ్ వంతు
న్యూయార్‌క: ఏడు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ట్రంప్ తాజాగా పాత ఆదేశాలకు కొన్ని మార్పులు చేసి కొత్తగా మరోమారు విడుదల చేశారు. గతంలో ఏడు దేశాలపై ఉన్న నిషేధాన్ని ఈసారి ఆరింటికి కుదించి ఇరాక్‌కు మినహాయింపు ఇచ్చారు. మరి కొత్త ఆదేశాల్లో ఏముందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. పాత వాటితో పోలిస్తే కొత్త ఆదేశాల్లో ఉన్నది ఒక్క ఇరాక్‌ను మినహాయించడం మాత్రమే. మిగతావన్నీ ఇంచుమించు పాతవే! అయితే ఇరాక్‌ను జాబితా నుంచి తొలగించడం వెనక బలమైన కారణం ఉందని చెబుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)పై పోరులో ఇరాక్ కీలక భాగస్వామి కావడం కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఇరాక్‌లో తనిఖీలు, వీసా స్క్రీనింగ్, డేటా షేరింగ్‌పై ఇప్పటికే ఇరాక్ ప్రభుత్వంతో మాట్లాడానని, ఈ విషయంలో ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉండడంతోనే నిషేధ జాబితా నుంచి ఇరాక్‌ను తొలగించినట్టు అమెరికా విదేశాంగ మంత్రి రెక్‌స టిల్లర్‌సన్ పేర్కొన్నారు. ఇక కొత్త నిబంధనల విషయానికి వస్తే..శరణార్థులపై 120 రోజుల నిషేధం ఉంది. అయితే ఇప్పటికే అనుమతి పొందిన శరణార్థులను మాత్రం అనుమతిస్తారు. అయితే ఏడాదికి 50 వేల పరిమితిని విధించారు. సిరియా శరణార్థులపై గతంలో విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు. నిషేధం విధించిన దేశాల పౌరులకు ఇప్పటికే గ్రీన్‌కార్డు ఉంటే అనుమతిస్తారు. సిరియా నుంచి వచ్చే క్రైస్తవ శరణార్థులకు కొత్త ఆదేశాల్లో ప్రాధాన్యం కరువైంది. పాత ఆదేశాల్లో మతపరమైన మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు ట్రంప్ తాజా ఆదేశాల్లో వివాదాస్పద అంశాలు తొలగించినప్పటికీ దీనిని కూడా కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతుండడం గమనార్హం. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేష దాడులపై ఆ దేశం స్పందించింది. భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న అమెరికా జాతి విద్వేష బాధితులకు సత్వరం న్యాయం చేస్తామని ప్రకటించింది. ఈ విషయంలో పూర్తి హామీ ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత భారతీయులకు సత్వరం న్యాయం జరిగేలా చూసే పూచీ తమదంటూ ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి సమాచారం అందినట్టు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇండియా సహా, దక్షిణాసియా దేశాల్లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ లలో పర్యటించేవారితో పాటు ఇండియాలో ఉన్న వారు సైతం తగు జాగ్రత్తలతో ఉండాలని సలహాలు ఇస్తూ, ప్రకటన వెలువరించింది. బంగ్లాదేశ్ లోని ఉగ్రవాదులు ఏ క్షణమైనా అమెరికన్లు లక్ష్యంగా దాడులు జరపవచ్చని, ఇండియాలో సైతం తీవ్రవాద సంస్థలు యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొంది. యూఎస్ సంస్థల కార్యాలయాలు, అమెరికన్ పౌరులు లక్ష్యంగా దాడులు జరగవచ్చని తెలిపింది. ఆఫ్గన్ లోని ఏ ఒక్క ప్రాంతం కూడా క్షేమకరమని చెప్పలేమని, పాక్‌లో ఇటీవలి ఉగ్రదాడుల్లో 130 మంది మరణించగా, వందలమంది గాయపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం ఈ దేశాల్లో పర్యటిస్తున్న అమెరికన్లు, ఉద్యోగ విధి నిర్వహణలో భాగంగా ఉన్న వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఓ వైపు అమెరికాలో డొనాల్‌డ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత, భారతీయులపై విద్వేష పూరిత దాడులు పెరిగిన వేళ, న్యూజిలాండ్‌లో సైతం అదే తరహా ఘటనలు ప్రారంభ మయ్యాయి. ఆక్లాండ్ లో ఓ సిక్కు యువకుడిపై స్థానికుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. నరీందర్వీర్ సింగ్ అనే యువకుడు, తన కారును పార్కింగ్ నుంచి తీస్తుండగా, ఓ జంట మరో వాహనంలో వచ్చిన సమయంలో, ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి నరీందర్వీర్ ను తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం. వారు వెళ్లిపోయేటప్పుడు తాను పక్కకు తప్పుకున్నానని, కారులోని యువతి తనవైపుకు వేలు చూపించగా, అతను తిట్ల దండకానికి దిగాడని, చాలా అవమానకరంగా మాట్లాడాడని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనను తాను వీడియో తీయగా, అతను మరింత రెచ్చిపోయాడని చెప్పాడు. కాగా, మరో ఘటనలో విక్రమ్ జిత్ సింగ్ అనే వ్యక్తిపై స్థానికుడు అసభ్యంగా మాట్లాడుతూ, ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించినట్టు తెలుస్తోంది. తాజా ఘటనలతో న్యూజిలాండ్ లోని ఇండియన్ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
హిందూ అమెరికన్ల ఆగ్రహం
అఘోరాలపై అసత్య కథనాన్ని ప్రచారం చేశారని సీఎన్‌ఎన్‌పై మండిపాటుప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్ చానెల్‌లో ఆదివారం ప్రసారమైన బిలీవర్ విత్ రెజా అస్లాన్ అనే ఆరు ఎపిసోడ్ల కార్యక్రమంలో అఘోరాల గురించి అసత్యాలు ప్రసారం చేశారని.. అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ప్రముఖ భారత అమెరికన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్‌డ ట్రంప్ మద్దతుదారుడు శలభ్ కుమార్ ఈ కథనంపై తీవ్రంగా మండిపడ్డారు. హిందూయిజంపై జరుగుతున్న దాడి ఇది. అమెరికాలోని మెజారిటీ భారతీయులు, హిందువులు గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగానే ఉద్దేశపూర్వకంగానే హిందూత్వంపై దాడిచేస్తున్నారు అని ట్విటర్ వేదికగా విమర్శించారు. అమెరికాలోని పలు హిందూ సంస్థలు, వ్యక్తులు కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపాయి. ఇటీవల అమెరికాలోని మైనారిటీల (భారతీయులు)పై దాడులు జరగుతున్న సమయంలో ఇలాంటి విద్వేషపూరిత, అసత్య కథనాలను ప్రసారం చేయటం మరింత ఘర్షణకు దారితీస్తాయి అని కాలిఫోర్నియా హిందూ సమాజం నేత ఖండేరావ్ కాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పురీ కూడా ఓ ప్రకటనలో ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన సీఎన్‌ఎన్‌ను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa