-ఎన్నికల హామీల అమలులో టీఆర్‌ఎస్ సర్కార్ విఫలం
-గిరిజనులకిచ్చిన హామీల అమలులోనూ అదే నిర్లక్ష్యం
-రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్
-గిరిజన హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం
-ఏప్రిల్‌లో గిరిజన గర్జన,బహిరంగ సభలు
-టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
-గిరిజనులకు భూమి హక్కు కల్పించిన కాంగ్రెస్
-బలవంతంగా లాక్కుంటున్న టీఆర్‌ఎస్ సర్కార్
-కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క
హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహించి, ప్రభుత్వ విధానాలను ఎండగడుతామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. గత మూడేళ్లుగా గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. హరిత హారం పేరిట టీఆర్‌ఎస్ సర్కార్ గిరిజన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుని, గిరిజన హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. గిరిజన హక్కుల సాధన కోసం గిరిజనగర్జన పేరిట ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం గాంధీభవన్‌లో మాజీ కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన నేతల సమావేశంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్‌జ దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి కుంటియా, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎస్.టి సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, మాజీ ఎం.పి రవీంద్ర నాయక్, పోడెం వీరయ్య, రేగ కాంతారావు, బెల్లయ్య నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులకు అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ ఎస్ సర్కార్, ఇప్పడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా అక్రమంగా స్వాధీనం చేసుకొని హరిత హారం పేరుతో మొక్కలు నాటుతుందని విమర్శించారు. గిరిజనులకు ప్రభుత్వాలు కల్పించిన చట్టాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రతి ఏటా రాష్టప్రతికి నివేదికలు ఇవ్వాల్సిన గవర్నర్ అవేమి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు వారికి అండగా ఉండేందుకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ఏప్రిల్ నెలలో తొమ్మిదవ తేదీ నుంచి 30వ తేదీ వరకు గిరిజన పోరాటాలు చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఖమ్మంలో గిరిజన గర్జన, ఏప్రిల్ 13న దామెరచర్లలో గిరిజన భారీ బహిరంగ సభ, ఏప్రిల్ 23న రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదనాంలో భారీ బహిరంగ సభ, ఏప్రిల్ 30వ తేదీన ఆదిలాబాద్‌లో గిరిజన సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ వివరించారు. కార్య నిర్వహక అధ్యక్షుడు మల్లు భట్ట విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన హక్కులను నిలువునా కాల రాస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు భూమిపై హక్కులు కల్పిస్తే ఈ పాలకులు బలవంతంగా లాక్కుంటూ, గిరిజనులకు హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. గిరిజన హక్కులకు భంగం కలిగితే రాష్టప్రతికి నివేదించాల్సిన గవర్నర్ ఎలాంటి సహకారం అందించడం లేదని ఆయన విమర్శించారు. గిరిజనుల హక్కులకు భంగం కలగకుండా వారికి కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa