ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ పోరాటమే మార్గం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 06:57 PM

రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్య రాజకీయ పార్టీలు చేసిన విధానాల కారణంగా ఏర్పడినవే కనుకే రాజకీయ పరిష్కారం ద్వారానే వాటికి పరిష్కారం సాధ్యం. రాజ్యాంగ నియమాలు, అమలులో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగినపుడు మాత్రమే న్యాయస్తానల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ నేడు ప్రభుత్వం చేస్తున్న విధాన నిర్ణయాల వలనే రాయలసీమ కు నష్టం జరిగింది. జరుగుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన టిటిడిలో నియామకాలను ఎలా నిర్వహించాలి అన్న విషయం పై సంస్థ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. ఏ పరిధిలో వారిని తీసుకోవాలి అన్న విషయంలో టిటిడి నిర్ణయానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ టిటిడి పాలక మండలి నియామకం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అందుకే అధికార పార్టీ వైఖరి ఇక్కడ కీలకంగా ఉంటుంది.
రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటే సీమ ప్రజలకు నష్టం....నీరు, ఆర్థిక వనరుల పై ఆధిపత్యం కలిగి ఉన్న మధ్య కోస్తా జిల్లాల ప్రజలతో పోటీపడటం వెనుకబడిన రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజలకు కష్టం. టిటిడిలో 2011 ప్రాంతంలో రాష్ట్రం యూనిట్ గా జరిగిన నియమకాలలో సీమకు దక్కింది15 శాతం మాత్రమే. తిరుపతిలోనే 120 జీఓ ప్రాతిపదికన పద్మావతి మెడికల్ కళాశాలలో జరిగిన అడ్మిషన్లలలో కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది. అందుకే టిటిడి నియమకాలలో జోనల్ పద్దతిలో జరగడమే రాయలసీమకు ప్రయోజనం.
120 జీఓ తరహా పోరాటమే మార్గం...పద్మావతి మెడికల్ సీట్లను 120 జీఓ ద్వారా రాష్ట్రాన్ని యూనిట్ గా చేసుకుని అడ్మిషన్లు చేసినప్పుడు తల్లిదండ్రులు సుప్రీం కోర్టు వరకు వెళ్లి జీఓను రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రతి సందర్భంలో సీమకు వ్యతిరేకంగా నిలబడింది. నేడు టిటిడి నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహారం చేస్తోంది అనుకోవడం అత్యాశ అవుతుంది. జీఓ120 రాష్ట్రపతి ఆదేశాలకు వ్యతిరేకం కనుక మనం కోర్టులు ద్వారా విజయం సాధించాం. టిటిడి స్వయంప్రతిపత్తి సంస్థ కనుక కోర్టుల ద్వారానే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం గతంలో లాగే వ్యవహారం నడిపితే సీమకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ పార్టీలను నిలదిస్తూ రాయలసీమ ఉద్యమాన్ని120 జీఓ వ్యతిరేక ఉద్యమం లాగా స్వతంత్రంగా నడపగలిగితే పార్టీలపై ఒత్తిడి పెరిగి ఎన్నికల సమయం కనుక రాజకీయ నిర్ణయం సీమకు అనుకూలంగా మారక తప్పదు. రాజకీయ పార్టీ అధినేతలు పట్టించుకోకుండా ఆయా పార్టీ స్థానిక నేతలు ఉద్యమంలో ఉంటే సీమ ప్రజలకు ఆయా పార్టీల మీద కోపం రాదు ఫలితంగా అధినేతల మధ్య కోస్తా అనుకూల వైఖరి వల్ల సమస్య పరిష్కారం కాదు. అధినేతల వైఖరి చెప్పని రాజకీయ నాయకులకు దూరంగా రాయలసీమ ఉద్యమం జరిగితే అపుడు ఎన్నికల అవసరాల కోసం అయినా తమ అధినేత పై వత్తిడి తీసుకు వస్తారు అన్నది 120 జీఓ వ్యతిరేక ఉద్యమం మనకు నేర్పిన పాఠం. ఆవైపు రాయలసీమ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత రాయలసీమ ఉద్యమ సంస్థల బాధ్యత.


 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com