కరోనా వైరస్ తెలంగాణలో పాజిటివ్ వచ్చిన క్షణం నుంచి ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు 24 గంటలు పని చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోషల్ మీడియాలో చైనాకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కరోనా వైరస్ సోకితే ఇక చావే శరణ్యం అన్నట్లుగా ప్రచారం సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని ఈటల అన్నారు. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో భరోసా కలగనిదే వారిలో ఆందోళనలు తగ్గే అవకాశం లేదని తెలిపారు. ఈ రోజు ఉదయం గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దగ్గరకు మంత్రి స్వయంగా వెళ్లారు. ఆయనతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో భయపడవద్దని ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందించి పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకు వస్తామని మంత్రి ఈటల భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల తో కూడా మంత్రి మాట్లాడారు.. డాక్టర్లుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మరచిపోయి, మీరే ఆందోళన చెందటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మంత్రిగా నేనే వచ్చినప్పుడు డాక్టర్లుగా మీరు భయపడటంలో అర్థం లేదని వారికి నచ్చజెప్పారు. కరోనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డుకు వెళ్ళే దారిలో ఏ ఒక్కరిని కూడా అనుమతించవద్దని ఆదేశాలు ఇచ్చారు.