కేంద్రంతో తెలంగాణ సీఎం కయ్యానికి కాలు దువ్వుతున్నారా..? ఢిల్లీ పెద్దలతో ఢీ అంటే ఢీ అనే రీతిలోనే ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారా..? సీఏఏతో పాటు పౌరసత్వ చట్టంపై ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేస్తానని ప్రకటించిన గులాబీ బాస్.. ఇప్పుడు డైరక్ట్ గా హాస్తినను డీ కొట్టేందుకు సిద్దమయ్యారా..? ఉభయసభలను ఉద్దేశించి నిన్న గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం చూస్తే అవుననే అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ తోనే కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. గవర్నర్ తమిళిసై నిన్నటి ప్రసంగం ఆసక్తికరంగా మారింది. మాట్లాడింది గవర్నరే అయినా.. మాట్లాడించింది మాత్రం ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ నే గవర్నర్ సభలో ప్రసగించారు. తెలంగాణ గంగా జమున తెహజీబ్ అని గుర్తు చేస్తూ మత సామరస్యానికి తెలంగాణ ప్రతీక అన్నారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు. తెలంగాణలో అన్ని పండుగలను జరుపుకుంటారని.. ప్రభుత్వం కూడ అన్ని పండుగలను జరుపుకోవడానికి వాతావరణం కల్పిస్తుందని ప్రసంగంలో పేర్కోన్నారు. అన్ని మతాల వారు తెలంగాణలో కలిసి మెలిసి జీవిస్తున్నారని ఆమె అన్నారు. దీంతో తాము సీఏఏతో పాటు ఎన్ఆర్సీని కూడ అమలు చేయబోమని సభ సాక్షిగా సీఎం కేసీఆర్ గవర్నర్ తో నే చెప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా సభ పెడతానని ఇటీవల ప్రకటించారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ సభ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఇలా గవర్నర్ ప్రసంగంలో సీఏఏను చేర్చడం కేసీఆర్ కేంద్రానికి ఎంత స్ట్రాంగ్ మేసేజ్ పంపారో అర్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా కేంద్ర పెద్దలకు కేసీఆర్ కు మధ్య సఖ్యత లేదన్నది వాస్తవం. దీనికి తోడు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తీరుతామని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. బీజేపీ కూడ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకే గులాబీ దళపతి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.