అసెంబ్లీలో ఆదివారం వార్షిక బడ్జెట్ (2020-21)ను ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గత రెండు రోజుల నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చజరుగుతోంది. ఇక కీలకమైన రాష్ట్ర బడ్జెట్ రేపు సభ ముందుకు రానుంది. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో ఆయన సభలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కాగా రెండోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కీలకమైన ఆర్థికశాఖను హరీష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి హోదాలో గత ఏడాది బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. మరోవైపు శాసనమండలిలో రేపు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ సమర్పించనున్నారు. గతేడాదితో పోల్చితే ఈ బడ్జెట్ లో అంచనాలు పెరగనున్నట్లు తెలిసింది. గతేడాది రూ. 1,32,629కోట్లు బడ్జెట్ ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాాది అదనంగా మరో రూ.30వేల కోట్లను చేర్చనున్నది. ఈ లెక్కన రూ. 1,62,000 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా బడ్జెట్ అంచనాలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. గతేడాది బడ్జెట్ లో నూతన పింఛన్లకు నిధులను కేటాయించలేదు. దీంతో లక్షలాది మంది అర్హులు పింఛన్లను దూరమయ్యారు. అంతేకాకుండా పింఛన్లకు వయో పరిమితి కూడా తగ్గించారు. దీనికి నిధుల్లేకపోవడంతో ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఈ బడ్జెట్ లో ఆసరాకు తప్పకుండా నిధులను కేటాయించనున్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటి వరకూ సాగునీటి రంగానికే తొలి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఈ బడ్జెట్ లో కొంత తగ్గించవచ్చునని తెలిసింది. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పూర్తయింది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు పెంచే అవకాశాలున్నట్లు తెలిసింది. సాగునీటి రంగానికి ఈ ఏడాది రూ.20వేల కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇక చిన్న చితక ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయలేదు. గతేడాది బడ్జెట్ లో రూ. 6వేల కోట్లు కేటాయించినప్పటికీ వాటిని ఖర్చు చేయలేదని తెలిసింది. పైగా త్వరలోనే రుణమాఫీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ బడ్జెట్ లో రూ.18వేల కోట్లు కేటాయించనున్నారు. రుణమాఫీకి రూ.24వేల కోట్లు అవసరమని బ్యాంకులు అంచనా వేయగా.. గత ఏడాది కేటాయించిన మొత్తానికి మరో రూ.6వేల కోట్ల అదనంగా కేటాయించి ఈ ఏడాది మొదట్లోనే రుణమాఫీ ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.