వర్షానికి పెంకుటిల్లు కూలడంతో ఓ వృద్దురాలు చనిపోయిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ములుగు జిల్లా మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన సోయం మంగమ్మ (60) ఆదివారం రాత్రి ఇల్లు కూలి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోయం మంగమ్మకు చెందిన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో మంగమ్మ ఇంట్లో నిద్రపోతోంది. దీంతో ఆమెపై ఇల్లు కూలడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు ఇంట్లో నుంచి బయటకు తీశారు. మంగమ్మకు భర్త, పిల్లలు ఎవరూ లేరు. ఒంటరిగా ఉంటోందని సమాచారం.